ముందే తెరుచుకున్న ‘సాగర్‌ గేట్లు’

2 Aug, 2021 07:55 IST|Sakshi
ఆదివారం రాత్రి సాగర్‌ నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయపురి సౌత్‌/అచ్చంపేట/సత్రశాల (రెంటచింతల): ఎగువ నుంచి వస్తున్న ప్రవాహ జలాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలానికి ప్రవాహం అధికంగా వస్తుండటంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా నాగార్జున సాగర్‌కు తరలిస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో ఆదివారం రాత్రి 9 గంటలకు 207.41 టీఎంసీలు నిల్వ ఉండగా.. డ్యామ్‌ నీటిమట్టం 883.50 అడుగులకు చేరుకుంది. ఆదివారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 5,29,963 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. ఇప్పటికే సాగర్‌ నిండటంతో ఈ ఏడాది జలాశయం క్రస్ట్‌ గేట్లు ముందుగానే తెరుచుకున్నాయి.

ఆదివారం అర్ధరాత్రికి సాగర్‌ నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు వదలనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య ప్రకాశం బ్యారేజీకి 3.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుందని అంచనా. దీంతో ప్రకాశం బ్యారేజీ దిగువ గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ముంపు ప్రాంతాల్లో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. 

వాయనం సమర్పించి సాగర్‌ గేట్లు ఎత్తివేత
నాగార్జున సాగర్‌ నిండటంతో డ్యామ్‌ 14 రేడియల్‌ క్రస్ట్‌గేట్లను ఈ ఏడాది ముందుగానే తెరిచారు. సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ ధర్మనాయక్‌ కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, సంప్రదాయ పద్ధతిలో వాయనం సమర్పించి హారతి ఇచ్చారు. అనంతరం 14 క్రస్ట్‌ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,06,462 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

సాగర్‌  టెయిల్‌ పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి 1,86,175 క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు డీఈ దాసరి రామకృష్ట, ఏఈఈ కె.నాగ నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. నాగార్జునసాగర్‌ నుంచి టెయిల్‌ పాండ్‌ ప్రాజెక్టుకు 31,290 క్యూసెక్కులు వస్తోందన్నారు. సాగర్‌ నుంచి మిగులు నీటిని వదలడంతో పులిచింతల ప్రాజెక్టుకు 4 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని పులిచింత ప్రాజెక్టు డీఈ రఘునాథరావు తెలిపారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు