సాగర్‌ 10 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

13 Oct, 2021 02:00 IST|Sakshi
సాగర్‌లో విడుదలవుతున్న నీరు

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

పులిచింతలకు 1,33,932 క్యూసెక్కులు విడుదల

విజయపురిసౌత్‌ (మాచర్ల)/సత్రశాల (రెంటచింతల)/శ్రీశైలం ప్రాజెక్ట్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 10 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు వచ్చే నీటి చేరిక పెరగడంతో మంగళవారం 4 క్రస్ట్‌గేట్లు 10 అడుగుల మేర, 6 క్రస్ట్‌గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 1,08,230 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం గరిష్ట స్థాయిలో 589.70 అడుగుల వద్ద ఉండగా ఇది 311.1486 టీఎంసీలకు సమానం. కాగా, నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి 1,33,932 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్‌ డీఈ దాసరి రామకృష్ణ, ఏడీఈ నాగనరసింహారావు మంగళవారం తెలిపారు. 

సాగర్‌కు 1.78 లక్షల క్యూసెక్కులు
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్‌కు 1,78,413 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 1,34,299 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. నాలుగు రేడియల్‌ క్రస్ట్‌ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి 1,11,932 క్యూసెక్కులు, రెండు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పాదన చేస్తూ మరో 66,481 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 214.3637 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్‌ నీటిమట్టం 884.80 అడుగులకు చేరింది.  

మరిన్ని వార్తలు