ఘనంగా నాగుల చవితి

2 Aug, 2022 22:39 IST|Sakshi
జమ్మలమడుగు రూరల్‌: నాగలకట్టలో ఉన్న పుట్ట వద్ద పూజలు నిర్వహిస్తున్న భక్తులు

పులివెందుల టౌన్‌ :  సల్లంగా చూడవయ్యా నాగరాజా అంటూ మహిళలు నాగుల చవితి పండుగను పురస్కరించుకుని సోమవారం తెల్లవారుజామునే పుణ్యస్నానాలు చేసి నోముల దారాలు, నువ్వులు, చలి పిండి తయారు చేసుకుని పుట్టల వద్దకు చేరుకున్నారు. అక్కడ పుట్టకు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి నూలు దారంతో పుట్టకు చుట్టి నోము చీర నాగుల పుట్టవద్ద పెట్టి పూజలు చేశారు.

అనంతరం ఉపవాస దీక్షలో ఉన్న మహిళలు కంకణాలు ధరించారు. నాగ పంచమి వరకు ఉపవాస దీక్షలు కొనసాగించి తర్వాత పుట్టలో పాలు, కొబ్బెర, బెల్లం వేసి ఉపవాస దీక్షలు విరమిస్తారు. పట్టణంలోని తూర్పు ఆంజనేయస్వామి, మిట్టమల్లేశ్వరస్వామి ఆలయంలోని నాగులకట్ట, కోతి సమాధి, బ్రాహ్మణపల్లెరోడ్డులోని నాగుల కట్ట, పార్నపల్లెరోడ్డు షిర్డిసాయిబాబా ఆలయంలోని నాగులపుట్ట, నాగుల కట్టల వద్ద  ప్రత్యేక పూజలు చేసి నాగుల చవితిని ఘనంగా జరుపుకున్నారు. 

ఎర్రగుంట్ల : నాగులచవితి పండుగను మండల వ్యాప్తంగా మహిళలు వైభవంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచి మహిళలు ఉపవాసాలతో నాగుల కట్టకు , పుట్టల వద్దకు వెళ్లి ఉపవాస దీక్షలు చేపట్టారు. 

ముద్దనూరు : నాగుల చవితి పర్వదిన వేడుకలను సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వాడవాడలా నాగదేవతకు ప్రతీకగా భావించే పుట్టల వద్ద భక్తులు పూజలు చేశారు. నాగదేవతకు ప్రీతికరమైన పాలు, నువ్వుల పిండి, పెసరపప్పులను నైవేద్యంగా అర్పించారు. పలువురు భక్తులు మొక్కుబడులు చెల్లించి పూజలు నిర్వహించారు.  
కమలాపురం :  కమలాపురం పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో నాగుల చవితి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. సోమవారం కమలాపురం, గంగవరం, సంబటూరు, కోగటం, పందిళ్లపల్లె, పెద్దచెప్పలి, చిన్నచెప్పలి తదితర గ్రామాల్లో మహిళలు తెల్లవారు జాము నుంచే తలస్నానాలాచరించి సమీపంలోని పుట్టవద్దకు చేరుకున్నారు. పుట్టలో పాలు పోసి 101 దారం పోగులు చుట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నువ్వుల పిండి, బియ్యం పిండి తదితర ప్రసాదాన్ని  పంచి పెట్టారు.  

వల్లూరు : మండలంలోని పలు గ్రామాలలో భక్తులు సోమవారం  నాగుల చవితి పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయాన్నే తల స్నానాలు చేసి నాగులకు, పుట్టలకు ఉపవాస దీక్షలను చేపట్టారు.  సలి పిండి, నువ్వుల పిండి, పెసర బేడలు, బియ్యం, కొబ్బెర, బెల్లంను నాగులు, పుట్టలకు సమర్పించారు. అనంతరం వాటిని ప్రసాదాలుగా పంచి పెట్టారు. 

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు 
జమ్మలమడుగు రూరల్‌:  
నాగులచవితి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం వేకువజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కుటుంబ సభ్యులతో నాగులపుట్ట వద్దకు తరలివచ్చారు.   పుట్టలో పాలు వేసి, పిండి పదార్థాలను పుట్ట వద్ద ఉంచి పూజలను నిర్వహించారు. 

మరిన్ని వార్తలు