ప్రభుత్వ సహకారంతో నష్టాలను అధిగమిస్తున్నాం

7 Feb, 2022 04:48 IST|Sakshi

ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2021–22లో విద్యుత్‌ పంపిణీ సంస్థలకు వివిధ రకాల సబ్సిడీల కింద రూ.9,717 కోట్లు విడుదల చేసిందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ తెలిపారు. ఏపీ సీపీడీసీఎల్‌  అమలు చేస్తున్న వివిధ నూతన ప్రాజెక్టులు, ప్రగతిపై  టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యుత్‌ సంస్థల బలోపేతానికి సీఎం వైఎస్‌ జగన్, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. అలాగే నష్టాలను తగ్గించడంలో డిస్కంలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయని అభినందించారు.

వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీపీడీసీఎల్‌ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి మాట్లాడుతూ..  దేశంలోనే  అత్యుత్తమ డిస్కంలలో ఒకటిగా నిలిచే లక్ష్యంతో  పనిచేస్తున్నట్లు తెలిపారు. పవర్‌ ఫర్‌ ఆల్‌ పథకం కింద రూ.517 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. స్కాడా కింద విజయవాడ, గుంటూరులలో సబ్‌స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

విజయవాడ, గుంటూరు నగరాల్లో 16 ఇండోర్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. విజయవాడలో కంటైనర్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టామని తెలిపారు. అగ్రికల్చర్‌ డీబీటీ పథకం కింద స్మార్ట్‌ ఎనర్జీ మీటర్ల ఏర్పాటుకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. 5వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలకు 3 ఫేజ్‌ విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.  

మరిన్ని వార్తలు