విద్యుత్‌ను పొదుపుగా వాడండి

10 Oct, 2021 02:51 IST|Sakshi

రాష్ట్రంపైనా దేశ బొగ్గు సంక్షోభం ప్రభావం

సాయమందించాలని ఇప్పటికే ప్రధానికి సీఎం లేఖ రాశారు

దేశవ్యాప్తంగా ఇబ్బందుల్లో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు  

భారీగా పెరిగిన విద్యుత్‌ వినియోగం, కొనుగోలు వ్యయం 

పీక్‌ అవర్స్‌లో విద్యుత్‌ వినియోగం తగ్గించక తప్పదు

వినియోగదారులకు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ విజ్ఞప్తి

సాక్షి, అమరావతి: దేశంలో బొగ్గు సంక్షోభం నెలకొన్న కారణంగా మన రాష్ట్రంపైన కూడా ఆ ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదముందని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిలో విద్యుత్‌ సంస్థలకు సహకరించాల్సిందిగా వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రతి వినియోగదారుడు విద్యుత్‌ పొదుపుపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పీక్‌ అవర్స్‌గా పిలుచుకునే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, రాత్రి 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏసీల వంటి పరికరాల వాడకం తగ్గించుకోవాలన్నారు. ఈ మేరకు విజయవాడలో శనివారం శ్రీకాంత్‌ మీడియాతో మాట్లాడారు.

కేంద్రం సహకారమందించాలి..
బొగ్గు కొరత సంక్షోభాన్ని అధిగమించేందుకు తగిన సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్‌ ఇప్పటికే లేఖ రాశారు. ఆ లేఖలో రాష్ట్రంలో 2,300 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లు పనిచేయడం లేదని తెలిపారు. వాటికి ఓఎన్జీసీ, రిలయెన్స్‌ నుంచి గ్యాస్‌ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని సీఎం కోరారు. అలాగే బొగ్గు కొనుగోలు ధరలు, విద్యుత్‌ మార్కెట్‌ ధరలు విపరీతంగా పెరిగినందున రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు బొగ్గు కొనుగోలు చేయడానికి రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

పడిపోయిన జెన్‌కో ఉత్పత్తి..
కోవిడ్‌ తర్వాత విద్యుత్‌ వినియోగం 2019తో పోలిస్తే 2021లో దేశవ్యాప్తంగా 18 శాతం, ఏపీలో 20 శాతం పెరిగింది. ఒకవేళ కోవిడ్‌ లేకపోతే జరిగే వినియోగం కంటే ఇది 8 శాతం ఎక్కువ. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకి వినియోగిస్తున్న 190 మిలియన్‌ యూనిట్లలో 80 మి.యూనిట్ల విద్యుత్‌ ఏపీ జెన్‌కో ద్వారా అందుతోంది. ప్రస్తుతం జెన్‌కో ఉత్పత్తి 50 శాతం (40 మి.యూ)కి పడిపోయింది. కేంద్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి రోజుకు 40 మి.యూ విద్యుత్‌ ఉత్పత్తి అవ్వాల్సి ఉండగా అందులో 75 శాతం (30 మి.యూ) మించి ఉత్పత్తి అవ్వట్లేదు. జల విద్యుత్‌ ఉత్పత్తి 25 మిలియన్‌ యూనిట్ల వరకే చేయగలం. రోజుకి 15 మి.యూ సౌర విద్యుత్‌ వస్తోంది. 30 మి.యూ పవన విద్యుత్‌ ఉత్పత్తి అవ్వాల్సి ఉండగా.. కేవలం 5 నుంచి 10 మి.యూనిట్లకే పరిమితమవుతోంది. 

బహిరంగ మార్కెట్‌లో ధరలు పెరిగాయి..
రాష్ట్రంలో 40 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేస్తుండగా ఈ నెల 8 నుంచి యూనిట్‌ సగటు ధర రూ.15కు పెరిగింది. ఇండోనేషియా నుంచి సరఫరా అయ్యే బొగ్గు ఏప్రిల్‌లో టన్ను 86.68 డాలర్లుండగా ఇప్పుడు 162 డాలర్లు అయ్యింది. మనరాష్ట్రంలో ఉన్న 5 వేల మెగావాట్ల థర్మల్‌ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. జెన్‌కో ప్లాంట్లకి రోజుకు 70,000 టన్నుల బొగ్గు అవసరం. గత నెలలో 24,000 టన్నులు మాత్రమే బొగ్గు అందుబాటులో ఉంది. కేంద్రాన్ని కోరాక అది ప్రస్తుతం రోజుకు 40,000 టన్నులకు చేరింది. 

20 బొగ్గు ర్యాక్స్‌ కేటాయించాలని విజ్ఞప్తి చేశాం..
బొగ్గు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఏటా అక్టోబర్‌ నుంచి జనవరి వరకు రాబోయే వేసవి కోసం నిల్వలు పెంచుతాయి. ఈ నేపథ్యంలో 2022 కోసం రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు 20 బొగ్గు ర్యాక్స్‌ కేటాయించాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. అలాగే దేశంలో విద్యుత్‌ ఉత్పత్తి ఒప్పందాలు, బొగ్గు సరఫరా ఒప్పందాలు లేని కారణంగా విద్యుత్‌ ఉత్పత్తి నిలిపేసిన కొన్ని ప్లాంట్లలో వెంటనే తాత్కాలికంగా విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించాం. విద్యుత్‌ సంస్థలను ఆదుకోవడానికి గత రెండేళ్లలో ప్రభుత్వం చేయగలిగినంత సహాయం చేసింది. దాదాపు రూ.34,340 కోట్ల ఆర్థిక సహాయం చేసి ఆదుకుంది.

కృష్ణపట్నం విద్యుత్‌ ప్లాంటుకే రూ.9,165 కోట్లు చెల్లించింది. మార్చి 2019 నాటికి రూ.27,239 కోట్లు ఉన్న విద్యుత్‌ సంస్థల మొత్తం నష్టాన్ని మార్చి 2021 నాటికి రూ.27,552 కోట్ల వద్దనే నిలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌ నాటికి చెల్లించాల్సిన విద్యుత్‌ సబ్సిడీని ప్రభుత్వం చెల్లించేసింది. బొగ్గు కొరత సంక్షోభం ప్రభావం విద్యుత్‌ రంగంపై తాత్కాలికమేనని భావిస్తున్నాం. అంతరాయాలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయడానికి విద్యుత్‌ పంపిణీ సంస్థలు కృషి చేస్తాయి. 

మరిన్ని వార్తలు