విద్యుత్‌ పంపిణీ సంస్థలకు.. టీడీపీ ఒక్క రూపాయీ ఇవ్వలేదు

8 Sep, 2021 04:11 IST|Sakshi

టీడీపీ హయాంలో రూ.12,500 కోట్ల నుంచి రూ.32,000 కోట్లకు చేరుకున్న అప్పులు

ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌

సాక్షి, అమరావతి: ట్రూ–అప్‌ సర్దుబాటు కోసం 2014 నుండి 2019 మధ్య ఒక్క రూపాయి కూడా విద్యుత్‌ పంపిణీ సంస్థలకి నాటి తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేయలేదని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఒక్క ఏడాదిలోనే రూ.6,000 కోట్లు అదనంగా వసూలుచేస్తున్నాయని వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. అవి పూర్తిగా అవాస్తవమన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ ఒకటి నుండి విద్యుత్‌ వాడకపోయినా కట్టవలసి వచ్చే నెలవారీ కనీస చార్జీలు రద్దుచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అలాగే, 2014 నుండి 2019 వరకూ ట్రూ–అప్‌ నివేదికలు దాఖలు చేయవద్దని అప్పటి టీడీపీ ప్రభుత్వం విధాన నిర్ణయమేదీ తీసుకోలేదని, అంతేకాక.. ఇందుకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు కూడా జారీచేయలేదని శ్రీకాంత్‌ వెల్లడించారు.

ఇక ప్రభుత్వ విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, అందువల్లే ఈ సర్దుబాటు చార్జీలు వసూలుచేయడానికి అనుమతించాలని కమిషన్‌ నిర్ణయించిందని విద్యుత్‌ నియంత్రణ మండలి తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 2019 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) రూ.12,539 కోట్లు నష్టంలోనూ, ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ రూ.7,745 కోట్ల నష్టంలోనూ ఉన్నాయని తెలిపింది. మరోవైపు.. 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటికి రూ.12,500 కోట్లు వున్న కొనుగోలు బకాయిలు, నిర్వహణ వ్యయ రుణాలు 2019 ఏప్రిల్‌ 1 నాటికి రూ.32,000 కోట్లకు చేరుకున్నాయి. 

మరిన్ని వార్తలు