‘సెకీ’ విద్యుత్‌ లాభమే

19 Oct, 2021 03:24 IST|Sakshi

ప్రస్తుతం ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్‌ ధర కన్నా ఇది తక్కువే.. యూనిట్‌కు రూ.1.87 వరకు ఆదా 

సంవత్సరానికి దాదాపు రూ.3,060 కోట్లు మిగులు 

అభూత కల్పనలతో అవాస్తవాలను ప్రచారం చెయ్యొద్దు 

‘ఈనాడు’ కథనంపై మండిపడ్డ రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌  

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) ఏర్పాటుచేసే 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టుతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకోవడం లాభదాయకమేనని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ స్పష్టం చేశారు. ‘సెకీ నుంచి విద్యుత్‌ కొంటే నష్టమే’ శీర్షికతో ఈనాడు ప్రచురించిన కథనంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రాజెక్టు ఏర్పాటుకు ఇచ్చే నిధులు మౌలిక సదుపాయాలు కల్పించే నిమిత్తం పార్క్‌ డెవలపర్‌కు చెల్లించేవేనని, బిడ్డింగ్‌ ధరలో ఈ అంశం కూడా ఉంటుందన్నారు. అలాగే.. జీఎస్టీ పన్నును విద్యుత్‌ ఉత్పత్తి ధరలో భాగంగా పరిగణించకూడదన్నారు. ‘సెకీ’ నుంచి విద్యుత్‌ తీసుకోవడంవల్ల ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న భూమి కూడా భవిష్యత్తులో ఇతర ప్రాజెక్టులు చేపట్టడానికి పనికొస్తుందని ఆయన పేర్కొన్నారు.

యూనిట్‌ రూ.2.49 పైసలకు తీసుకుంటే 3% అంతర్రాష్ట్ర విద్యుత్‌ ప్రసార నష్టాలు 7.5 పైసలు మాత్రమే వస్తుందని.. 27 పైసలు కాదని శ్రీకాంత్‌ తెలిపారు. అంతేకాక.. రాష్ట్రంలో సౌర ప్రాజెక్టులు చేపట్టినప్పుడు వాటికి కావలసిన విద్యుత్‌ లైన్లు, అంతర్గతంగా విద్యుత్‌ ప్రసార వ్యవస్థ బలోపేతానికి అయ్యే ఖర్చు.. బయటి రాష్ట్రం నుంచి నేరుగా సౌర విద్యుత్‌ తీసుకున్నప్పుడు అంతర్గత వ్యవస్థకు అయ్యే ఖర్చుల మధ్య కూడా తేడా ఉంటుందని వివరించారు. ప్రాథమికంగా ఇప్పుడున్న అంతర్రాష్ట్ర, అంతర్గత రాష్ట్ర విద్యుత్‌ ప్రసార వ్యవస్థల సామర్థ్యాన్ని బేరీజు వేసుకుంటే.. బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్‌ తీసుకున్నప్పుడే ఖర్చు తక్కువవుతుందని శ్రీకాంత్‌ స్పష్టంచేశారు. 

యూనిట్‌కు రూ.1.87 పైసల ఆదా
ప్రస్తుతం రూ.4.36 పైసల చొప్పున ఒక యూనిట్‌ విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామని.. అయితే, ‘సెకీ’ నుండి దీర్ఘకాలిక ఒప్పందం ద్వారా అదే ఒక యూనిట్‌ విద్యుత్‌ను 2.49 పైసలకు కొనుగోలు చేయడంవల్ల యూనిట్‌కు రూ.1.87 పైసల వరకు ఆదా అవుతుందని శ్రీకాంత్‌ తెలిపారు. ఈ లెక్కన ఏటా దాదాపు రూ 3,060 కోట్లు ఆదా అవుతుందని ఆయన వివరించారు. 

ఉచిత వ్యవసాయ విద్యుత్‌ కోసమే..
ఇక సీఎం వైఎస్‌ జగన్‌ సత్సంకల్పంతో రానున్న 25 ఏళ్లకు రాష్ట్రంలోని రైతుల ఉచిత వ్యవసాయ విద్యుత్‌ అవసరాల కోసమే ‘సెకీ’ నుంచి విద్యుత్‌ తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఒక సుస్థిరమైన, ప్రత్యేక ఫీడర్లు కల్గిన, అదనపు లోడ్‌ గుర్తించే సామర్థ్యమున్న మీటర్లతో ఒక స్వతంత్ర విద్యుత్‌ వ్యవస్థను తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఈ తక్కువ ధర సౌర విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అమలులో వున్న సౌర పీపీఏల సగటు యూనిట్‌ ధర దాదాపు రూ.4.50 ఉందన్నారు. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌కి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్‌ ధర యూనిట్‌ రూ.2.79 పైసల (ట్రేడింగ్‌–మార్జిన్‌ కలిపి) కన్నా ‘సెకీ’ ప్రతిపాదించిన యూనిట్‌ రూ.2.49పై. (ట్రేడింగ్‌–మార్జిన్‌ కలిపి) ధర తక్కువని శ్రీకాంత్‌ స్పష్టంచేశారు. కాబట్టి.. అనవసరంగా లేనిపోని అభూత కల్పనలతో అవాస్తవాలను ప్రచారం చేయవద్దని ఆయన హితవు పలికారు. 

మరిన్ని వార్తలు