నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి : నకిలీ పట్టాలతో నిరుపేదలకు కుచ్చుటోపీ

26 Jul, 2021 09:52 IST|Sakshi

నకిలీ పట్టాలతో నిరుపేదలకు కుచ్చుటోపీ

యథేచ్ఛగా ప్రభుత్వ భూముల కబ్జా 

ఇంటి స్థలాలు స్వాహా చేసిన అనుచరులు 

పీలేరులో టీడీపీ నేతల భూబాగోతం

ఓట్ల కోసం విలువలను వదిలేశారు.. ఇంటి స్థలం కోసం ఆశపడిన నిరుపేదలను నకిలీ పట్టాలతో నయవంచన చేశారు.. పేదలకు ఇచ్చినట్లు చూపిన భూములను టీడీపీ నేతలే కబ్జా చేసుకున్నారు. అడుగులకు మడుగులొత్తే అనుచరులకు మాత్రం రూ.కోట్ల విలువైన స్థలాలు కట్టబెట్టేశారు.. ఇదేమని ప్రశ్నించిన వారికి బురద అంటించేందుకు ప్రయతి్నస్తున్నారు.. వాస్తవాలను తొక్కిపెట్టి గోబెల్స్‌ ప్రచారానికి తెరతీస్తున్నారు.. టీడీపీ హయాంలో పీలేరు నియోజకవర్గంలో బట్టబయలైన నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అండ్‌ కో అవినీతి అక్రమాలను చూసి స్థానికులు నోరెళ్లబెడుతున్నారు.  

సాక్షి, తిరుపతి: గత టీడీపీ ప్రభుత్వంలో నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి పీలేరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పెత్తనం చెలాయించారు. అనుచరులతో కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వందలాది ఎకరాలను ఆక్రమించుకున్నారు. చెరువు, కుంట, కాలువ, పోరంబోకు భూములను యథేచ్ఛగా కబ్జా చేశారు. నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన ఇంటి పట్టాలను  నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి తన అనుచరులు 500 మందికి కట్టబెట్టారు. అదే సమయంలో నియోజకవర్గంలో సొంత ఇల్లు లేని సుమారు 10వేల మంది నోట్లో మట్టికొట్టారు.

ఇంటి స్థలాలు ఇస్తామని ఆశచూపి తన కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నారు. అయితే 2019లో సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో కొందరు రెవెన్యూ సిబ్బంది సాయంతో నకిలీ పట్టాలను సృష్టించారు. ఓట్ల కోసం కక్కుర్తి పడి వందలాది మంది పేదలకు పంచి ఈ నకిలీ పట్టాలను పెట్టేశారు. ఈ క్రమంలోనే ఆర్థిక స్థోమత ఉన్న వారి నుంచి రూ.లక్షల్లో సొమ్ము వసూలు చేసుకుని నకిలీ పట్టాలు అంటగట్టేశారు. ఆ పట్టాల్లో ఉన్న సర్వే నంబర్లలో ఉన్న స్థలం పట్టణంలో ఎక్కడా లేకపోవడం గమనార్హం. దీంతో లబి్ధదారులు దిక్కుతోచక లబోదిబోమంటున్నారు.

అక్రమాలు వెలుగులోకి.. 
పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె, నాగిరెడ్డి కాలనీ, నాయీబ్రాహ్మణ కాలనీ, జర్నలిస్టు కాలనీ, రజకుల కాలనీ, ఎన్టీఆర్‌ కాలనీలో సుమారు 200 నకిలీ పట్టాలు బయటపడ్డాయి. తమకు పట్టా ఇచ్చినా స్థలం చూపించలేదని బాధితులు తహసీల్దార్‌ను కలవడంతో వాస్తవం వెలుగు చూసింది. దీనిపై 22 మంది బాధితులు కోర్టును ఆశ్రయించారు. కేవలం ఆరు కాలనీల్లోనే ఈ స్థాయిలో నకిలీ పట్టాలు ఉంటే, మొత్తం నియోజకవర్గంలో ఇంకెన్ని ఉంటాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అండ్‌ కో సాగించిన ఆక్రమణల పర్వంపై గతంలోనే ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నల్లారి భూదందా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతుండడం గమనార్హం. 

మరిన్ని వార్తలు