‘అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు’

27 Dec, 2020 16:47 IST|Sakshi

సాక్షి, గుంటూరు : అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతి భూముల కోసం ఉద్యమిస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అమరావతి ప్రజలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. పేదవాడికి ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమరావతిలోని 29 గ్రామాల ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదని ఎంపీ మండిపడ్డారు. అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారని, నిజమైన రైతులు, పేదవాళ్లు ఎవరూ దీక్షలు చేయడంలేదని పేర్కొన్నారు.

పేదవాడిపై ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు అందకుండా కోర్టుల్లో టీడీపీ నేతలు పిటిషన్లు వేస్తున్నారని, వారిపై ఏమాత్రం ప్రేమ ఉన్నా కోర్టులో వేసిన పిటిషన్‌ వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన నదిగం సురేష్‌ పేదల ఇళ్లను బాత్‌రూమ్‌లతో పోల్చిన సంస్కారహీనులు చంద్రబాబు, లోకేష్‌ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి చంద్రబాబు బినామీ రాజధాని అని విమర్శించారు. అమరావతి రైతులను బెదిరించి చంద్రబాబు భూములను దోచుకున్నారని అన్నారు. త్యాగం చేయడమంటే ఉచితంగా భూములు ఇవ్వడమని తెలుసుకోవాలని హితవు పలికారు.

మరిన్ని వార్తలు