సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలుగా గ్రామ సచివాలయాలు

3 Oct, 2022 20:00 IST|Sakshi
సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇస్తున్న శిరివెళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు

గ్రామ సచివాలయాల్లో ప్రారంభమైన రిజిస్ట్రేషన్‌ సేవలు

చలానా, డాక్యుమెంట్లు రాయడం, ఫీజుల చెల్లింపు తదితరవన్నీ అక్కడే

రిజిస్ట్రేషన్‌ సేవలకు నంద్యాల జిల్లాలో ఏడు సచివాలయాల ఎంపిక

విడతల వారీగా అన్ని  సచివాలయాలకు విస్తరణ

జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ – 3గా సచివాలయ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్లు

గ్రామీణులకు తప్పనున్న వ్యయ ప్రయాసలు

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఇప్పటికే ఊరూరా ఏర్పాటు చేసిన గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలు అందిస్తున్న సర్కారు ఆస్తుల రిజిస్ట్రేషన్‌ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగాత్మకంగా జిల్లాలో ఒక సచివాలయం ద్వారా ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఆదివారం నుంచి మరో ఏడు సచివాలయాల్లో అమలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో సుదూర ప్రాంతాల్లోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సేవలు పొందవచ్చు.

ఆళ్లగడ్డ: ఇది వరకు ఏ రకమైన రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నా సుదూర ప్రాంతాల్లోని  రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లాలి. ఇందుకు ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చాలి. దీనికితోడు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల వద్ద దళారుల దోపిడీ. వీటన్నింటికీ  చెక్‌ పెట్టి స్థానికంగా ఉన్న గ్రామ/వార్డు సచివాలయాల్లోనే అన్ని రకాల రిజిస్ట్రేషన్‌ సేవలు అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టాంప్స్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా కార్యాచరణ రూపొందించి గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నుంచి అమలుకు శ్రీకారం చుట్టాయి.     


సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలుగా సచివాలయాలు 

ప్రస్తుతం నంద్యాల జిల్లా వ్యాప్తంగా 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవాలంటే రెండు నుంచి మూడు రోజులు వాటి చుట్టూ తిరగాలి. అయినా, సకాలంలో పని పూర్తవుతుందో లేదో తెలియదు. ఇక నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చెంతనే ఉన్న సచివాలయాల్లో సులభంగా రిజిస్ట్రేషన్‌ సేవలు పొందవచ్చు.


రీ సర్వే పూర్తి చేసుకున్న గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల పక్రియ కొనసాగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడతలో కొన్నింటిని ఎంపిక చేశారు. అందులో జిల్లాలో నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ సచివాలయాన్ని ఎంపిక చేసి దాదాపు 8 నెలల పాటు విజయవంతంగా సేవలు అందించారు. తాజాగా  రెండో విడతలో  జిల్లాలో 7 గ్రామ సచివాలయాలను ఎంపిక చేశారు. వీటిలో నూతనంగా  రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభించనున్నారు. ఇలా విడతల వారీగా మరో ఏడాదిలోపు జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.     


భూ రీసర్వేతో కబ్జాలకు చెక్‌
 
ఎప్పుడో బ్రిటీష్‌ పరిపాలనలో చేసిన సర్వేనే ఇప్పటికీ ఆధారం. దీంతో భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు గందరగోళంగా ఉన్నాయి. ఫలితంగా గ్రామాల్లో భూవివాదాలు పెరిగిపోతున్నాయి. కొన్నిచోట్ల ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడుతున్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా సర్వేనంబర్లలో సబ్‌ డివిజన్‌లకు ప్రభుత్వం స్వస్తి పలుకుతుంది. ఉదాహరణకు 1, 1ఏ, 1బి, 1బి/ఏ  లాంటి సబ్‌డివిజన్‌ సర్వే నంబర్లు ఇక నుంచి ఉండవు. సర్వేనంబర్‌ 1, 2 ఇలా ఒకే నంబర్‌తో ఉంటాయి. ఇప్పటి వరకు సబ్‌ డివిజన్‌లు సృష్టించి అక్రమాలకు పాల్పడుతూ వచ్చారు. ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న భూ రీ సర్వేలో ఊరు, సచివాలయ పరిధి, మండలం కనబరుస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్‌ పక్కాగా ఉంటుంది. అలాగే ఒకరి భూమిని మరొకరు  కబ్జా చేసే పరిస్థితి ఉండదు. 


అందించే రిజిస్ట్రేషన్‌ సేవలు ఇవే..  

జిల్లాలో ఎంపిక చేసిన సచివాలయాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అందించే అన్ని రకాల సేవలు అందుతాయి.  అక్నాలెడ్జ్‌మెంట్‌ అప్‌డేట్, డేటా ఫీడింగ్, చెక్‌ స్లిప్, రెగ్యులర్‌ నంబర్‌ కేటాయింపు, ఫొటో, వేలి ముద్రలు తీసుకోవడం, డాక్యుమెంట్‌ ప్రింటింగ్, స్కానింగ్, విక్రయ దస్తావేజు, సెటిల్‌ మెంట్‌ దస్తావేజు, దాన విక్రయం, తనఖా, చెల్లు రసీదు, భాగ పరిష్కారం రిజిస్ట్రేషన్‌ రద్దు, మ్యానువల్‌ ఈసీ, ఆన్‌లైన్‌ ఈసీ, మార్కెట్‌ వాల్యుయేషన్‌ సర్టిఫికెట్, వివాహ రిజిస్ట్రేషన్‌ తదితర సేవలు అందిస్తారు. (క్లిక్ చేయండి: 'నన్నారి'కి నల్లమల బ్రాండ్‌!)


సిద్ధంగా ఉన్నాం

సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్‌ సేవలు అందించేందుకు నాతో పాటు 13 మంది కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్లు ఆరు నెలలుగా శిరివెళ్ల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శిక్షణ తీసుకున్నాం. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్‌ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రకాల రిజిస్ట్రేషన్‌ సేవలను మా సచివాలయం ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.  
– రాజ్‌కుమార్, పీఎస్‌ గోవిందపల్లె సచివాలయం –2, శిరివెళ్ల మండలం   


సేవలు మరింత సులభతరం

ఎంపిక చేసిన గ్రామ సచివాలయాల్లో  పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపడుతున్నాం. ఇందుకు సబ్‌ రిజిస్ట్రార్‌లు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వచ్చి గంటల తరబడి క్యూలో ఉండి పనులు చేయించుకోవాలంటే కొంచం ఇబ్బంది ఉండేది. ఇప్పుడు వారి గ్రామాల్లోనే సులభంగా రిజిస్ట్రేషన్‌ సేవలు పొందవచ్చు.     
– నాయబ్‌ అబ్దుల్‌సత్తార్, ఏపీ  రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్‌ ఎంప్లాయీస్‌ రాష్ట్ర అధ్యక్షుడు 

మరిన్ని వార్తలు