టీడీపీ నేతల హైడ్రామా

22 Aug, 2022 04:05 IST|Sakshi
విశాఖ ఎయిర్‌పోర్ట్‌ వద్ద బైఠాయించిన లోకేశ్‌

ఆక్రమణదారును పరామర్శించే నెపంతో గలాటాకు యత్నం

లోకేశ్‌ను శ్రీకాకుళం కొత్తబ్రిడ్జి వద్ద అడ్డుకున్న పోలీసులు

విశాఖ విమానాశ్రయం వద్ద బైఠాయించిన లోకేశ్‌

సాక్షి, విశాఖపట్నం/శ్రీకాకుళం రూరల్‌/కాశీబుగ్గ/ నరసన్నపేట/ఎచ్చెర్ల క్యాంపస్‌: సిక్కోలులోను, విశాఖలోను ఆదివారం టీడీపీ నాయకుడు లోకేశ్, ఇతర నేతలు నాయకులు హైడ్రామా సృష్టించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విశాఖ విమానాశ్రయం వద్ద ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. లోకేశ్, పార్టీ శ్రేణులు రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించినా పోలీసులు సంయమనం పాటించారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా పలాసలో రెవెన్యూ అధికారులు భూ ఆక్రమణలపై చర్యలు చేపట్టారు. ఈ ఆక్రమణలన్నీ టీడీపీ నేతలవే కావడంతో ఆ పార్టీ నాయకులంతా ఆక్రమణల తొలగింపును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున గలాటా సృష్టించడానికి ప్రయత్నించారు.

ఆక్రమణదారుడు పలాస కౌన్సిలర్‌ సూర్యనారాయణను పరామర్శించే నెపంతో అందరూ ఒక్కచోటుకు చేరి గొడవ చేయడానికి పూనుకున్నారు. పలాసలో 144 సెక్షన్‌ అమల్లో ఉంది. ఆ పార్టీ నేత లోకేశ్‌ అనుమతి లేకుండా పలాస వెళ్లడానికి ప్రయత్నించగా శ్రీకాకుళం కొత్తబ్రిడ్జి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. అనంతరం లోకేశ్‌ను, పార్టీ నాయకులు కళా వెంకట్రావు, చినరాజప్పలను రణస్థలం పరిధిలోని జేఆర్‌పురం పోలీస్‌స్టేషన్‌ వరకు తీసుకెళ్లారు. లోకేశ్‌కు 149 నోటీసులు ఇచ్చి విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకెళుతుండగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు.

మార్గంమధ్యలో మధురవాడలో విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కుమారుడి వివాహ వేడుకకి హాజరైన ఆయన అక్కడ ప్రెస్‌ మీట్‌ పెడతామని చెప్పారు. 149, 151 నోటీసులు జారీచేసినప్పుడు మీడియాతో మాట్లాడకూడదని పోలీసులు పలుమార్లు చెప్పినా ఆయన వినిపించుకోకుండా బెదిరింపు ధోరణితో వ్యవహరించారు. దీంతో పోలీసులు లోకేశ్‌ని బలవంతంగా వాహనంలో ఎక్కించి విమానాశ్రయానికి తీసుకొచ్చారు. ఆయన ఎయిర్‌పోర్టు వద్ద పేవ్‌మెంట్‌పై బైఠాయించారు.

నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సాయంత్రం ఆరుగంటలకు ఆందోళన విరమించిన లోకేశ్‌ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు కిరాతకంగా తనని నిర్బంధించారని చెప్పారు. ఎక్కడికి తీసుకెళుతున్నారో చెప్పకుండా ఎయిర్‌పోర్టుకి తీసుకొచ్చారని, మధ్యలో పెళ్లికి తీసుకెళ్లారని, ఎయిర్‌పోర్టు బయట కూర్చోబెట్టారని పేర్కొన్నారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడులను ముందస్తుగా నరసన్నపేట మండలం మడపాం టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని మధ్యాహ్నం విడిచిపెట్టారు.  

మరిన్ని వార్తలు