దిశ బిల్లు ప్రతులను తగులబెట్టిన నారా లోకేశ్‌

10 Sep, 2021 02:46 IST|Sakshi
దిశ బిల్లు ప్రతులను తగలబెడుతున్న నారా లోకేశ్‌

అనుమతి లేకుండా ఆందోళనకు యత్నం 

ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు 

శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో కేసు నమోదు  

దిశ చట్టం పేరుతో మహిళలను మోసం చేశారన్న లోకేశ్‌

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: దిశ బిల్లు ప్రతులను టీడీపీ నాయకులతో కలిసి, మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తగులబెట్టారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో అనుమతులు లేకుండా ఆందోళన చేయడానికి వెళ్తున్న లోకేశ్‌ను గురువారం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని ఉండవల్లిలోని నివాసానికి తరలించారు. అక్కడ దిశ బిల్లు ప్రతులను తగులబెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.

దిశ చట్టం అంటూ మహిళల్ని దగా చేశారన్నారు. నరసరావుపేటలో అనూష అనే యువతి హత్యకు గురై ఆరు నెలలైనా దోషులకు శిక్ష పడలేదన్నారు. గడిచిన 21 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు, హత్యల ఘటనలు 17 చోటు చేసుకున్నాయని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మహిళలపై అఘాయిత్యం ఘటనలు 517 చోటు చేసుకుంటే ఇప్పటి వరకు ఒక్క కేసులో కూడా దోషులకు శిక్ష పడలేదన్నారు. తన సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మను దారుణంగా చంపేస్తే ఈ రోజు వరకు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదన్నారు. కర్నూలులో హాజీరాని, బద్వేల్‌లో శిరీష ఘటనల్లో ఏడాదైనా దోషులకు శిక్ష పడలేదని చెప్పారు. గుంటూరులో దళిత యువతి రమ్య హత్య ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు.    

టీడీపీ నేతల అరెస్ట్‌  
విమానాశ్రయం ప్రాంతంలో 144 సెక్షన్‌ అమలులో ఉన్న కారణంగా లోకేశ్‌ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఆ పార్టీ నేతలు గుంపులుగా అక్కడికి చేరుకుని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంపై, పోలీసులపై దూషణలకు దిగడంతో పాటు 144 సెక్షన్‌ను ఉల్లంఘించారు. దీంతో మాజీ ఎమ్మెల్యేలు శ్రీరామ్‌ తాతయ్య, తంగిరాల సౌమ్య, పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా లోకేశ్‌పై విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ముందస్తుగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ట్రాఫిక్‌కు అంతరాయం, శాంతి భద్రతలకు విఘాతం       కలిగించడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

మమ్మల్ని అరెస్ట్‌ చేయండి ప్లీజ్‌ 
తాడేపల్లిరూరల్‌ : ‘మమ్మల్ని అరెస్ట్‌ చేయండి.. ఆ ఫొటోలు మా నాయకుడికి పంపించాలి. లేదంటే మేము పని చేయడం లేదని ముద్ర వేస్తారు. ప్లీజ్‌ సర్‌.. అరెస్ట్‌ చేయండి’ అంటూ కొంత మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులను అభ్యర్థించారు. టీడీపీ ఏ ఆందోళన చేసినా ఆ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని వారి పార్టీ సోషల్‌ మీడియా విభాగానికి ఆ ఫొటోలను తప్పని సరిగా పంపించాలని చెప్పారట.  ఆందోళనలో ప్రభుత్వాన్ని, ముఖ్య నేతలను దూషించిన వీడియోలు కూడా పంపాలని నిబంధన పెట్టారట. ఈ నేపథ్యంలో నారా లోకేశ్‌ గురువారం నరసరావుపేట వెళ్లేందుకు వస్తుండగా, తాడేపల్లిలోని చంద్రబాబు ఇంటి వద్దకు చేరిన టీడీపీ నాయకులు హంగామా చేశారు. ఈ సందర్భంగా తమను అరెస్ట్‌ చేయాలని కోరారు.   

మరిన్ని వార్తలు