లోకేశ్‌ అనుచరుల మోసం 

22 Jun, 2022 05:50 IST|Sakshi
టీడీపీ నాయకురాలు మంజూష చౌదరి ఇంటిముందు ధర్నా చేస్తున్న దంపతులు కృష్ణ, తేజస్విని

చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలు చూపించి రూ.35 లక్షలకు టోకరా 

ఇంటిముందే బైఠాయించిన యువజంట 

న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక  

తాడేపల్లి రూరల్‌:  టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లకు అతి సన్నిహితంగా ఉండే టీడీపీ నేత మంజూష చౌదరి, హరిబాబు చౌదరి అనే దంపతులు అప్పు పేరిట ఓ యువజంట నుంచి రూ.35 లక్షలు తీసుకుని ఆనక టోకరా వేసిన ఉదంతం మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన కృష్ణ అనే యువకుడు టీడీపీ అభిమాని. విజయవాడలోనే ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. కాగా, ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి అతి సమీపంలోనే ఉండే మంజూష, హరిబాబు చౌదరి దంపతులు.. కృష్ణ, అతని భార్య తేజస్వినితో పరిచయం పెంచుకున్నారు.

చంద్రబాబు నివాసంలోనే తిరుగుతూ ఉండే ఆ దంపతులు చంద్రబాబు, లోకేశ్‌తో దిగిన ఫొటోలను చూపించి వారితో తమకెంతో సాన్నిహిత్యం ఉందని.. ఆ ఇంటి వ్యవహారాలను తామే చూస్తామని నమ్మబలికారు. మూడున్నరేళ్ల క్రితం కృష్ణ, తేజస్విని నుంచి త్వరలోనే తిరిగి చెల్లిస్తామంటూ రూ.35 లక్షలు నగదు అప్పుగా తీసుకున్నారు. ఆ మొత్తం తిరిగివ్వాలని అడిగినప్పుడల్లా వాయిదాలు వేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. దీంతో కృష్ణ, తేజస్విని కలిసి మంగళవారం ఉండవల్లి చేరుకుని డబ్బు చెల్లించాలంటూ మంజూష చౌదరి, హరిబాబు చౌదరి ఇంటిముందు బైఠాయించారు.

ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. డబ్బులు అడుగుతుంటే తిరిగివ్వడం లేదని, తాను బీసీని కాబట్టే తెలుగుదేశం పార్టీ నాయకులెవరూ ఈ విషయం గురించి పట్టించుకోవడం లేదని వాపోయారు. డబ్బులు ఇవ్వని పక్షంలో భార్యాభర్తలిద్దరం మంజూష చౌదరి ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. తన భార్య 7 నెలల గర్భవతి అని, ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కూడా డబ్బులు లేవని, కన్న కూతురుకి మూడు పూటలా అన్నం పెట్టలేకపోతున్నానని వాపోయారు. తాను కుదువబెట్టిన బంగారం కూడా వేలానికి వచ్చిందని తెలిపారు. టీడీపీ నాయకులు వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరాడు.  

టీడీపీ నేతల బెదిరింపులు 
తమకు రావాల్సిన డబ్బు కోసం మంజూష చౌదరి ఇంటిముందు కృష్ణ, తేజస్విని దంపతులు ధర్నా చేస్తున్నారని తెలుసుకున్న టీడీపీ నాయకులు రంగంలోకి దిగి వారిద్దరినీ బెదిరించారు. మీరు ఏం చేసినా ఉపయోగం లేదని, ఇక్కడి నుంచి వెళ్లిపోండని, లేకపోతే రిస్క్‌లో పడతారని బెదిరించడంతో కృష్ణ, తేజస్విని ఏడ్చుకుంటూ వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై కృష్ణ దంపతులను వివరణ కోరగా.. తామిద్దరం ఆత్మహత్య చేసుకుంటామని, అప్పుడు పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. 

మరిన్ని వార్తలు