ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలదండ వేయమన్నా వేయని లోకేశ్‌

1 Sep, 2021 05:40 IST|Sakshi
లోకేశ్‌ అక్కడ ఉండగానే ఎన్టీఆర్‌ విగ్రహానికి గజమాల వేస్తున్న పార్టీ కార్యకర్తలు

కారు కూడా దిగని వైనం

అసహనానికి లోనైన నాయకులు, కార్యకర్తలు

ఎటపాక: తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో మంగళవారం పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌)ను విస్మరించారు. కనీసం ఆయన విగ్రహాలకు ఎక్కడా పూలమాల కూడా వేయలేదు. తొలుత లోకేశ్‌ ఎటపాక మీదుగా నెల్లిపాక చేరుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం నెల్లిపాక జాతీయ రహదారి సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేయాల్సి ఉంది.

ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండురోజులుగా స్వాగత బ్యానర్లు కట్టి గజమాల సిద్ధం చేశారు. నెల్లిపాక చేరుకున్న లోకేశ్‌  కారులో నుంచే అక్కడి వారికి అభివాదం చేసి వెళ్లిపోయారు. పూలమాల వేయలేనంటూ కారుదిగక పోవటంతో కార్యకర్తలే ఎన్టీఆర్‌ విగ్రహానికి గజమాల వేయటం గమనార్హం. లోకేశ్‌ తీరుతో కార్యకర్తలు కొంత నొచ్చుకున్నారు. బతిమిలాడినా కారు కూడా దిగకుండా వెళ్లటం సరికాదని ఆపార్టీ నేతలు ఆవేదన చెందారు. కూనవరం మండలం నర్శింగపేటలో కూడా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేయలేదు. దీనిపైనా పార్టీ కార్యకర్తల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. 
(చదవండి: నలుగురు బ్యాంకు ఉద్యోగుల సస్పెన్షన్‌)

మరిన్ని వార్తలు