ఆయన మరణం సమాజానికి తీరనిలోటు

4 Aug, 2020 10:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ విప్లవ కవి, ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మరణం సమాజానికీ తీరని లోటని పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌ నారాయణమూర్తి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయనని ఉత్తరాంధ్ర సంతకం అని గొల్లపూడి మారుతీరావు కొనియాడారు. పార్వతీపురం మహాసభలో మహాకవి శ్రీశ్రీ మాట్లాడుతూ నిజమైన ప్రజాకవి నేను కాదు వంగపండు ప్రసాదరావు, గద్దర్ అన్నారు. (ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత)

వంగపండు నా అర్ధరాత్రి స్వతంత్య్రం సినిమాలో గొప్ప పాటలు రాశారు, పాడారు, నటించారు. తర్వాత కూడా నా అనేక చిత్రాలకు ఆయన పాటలు రాశారు. నా చిత్ర విజయాలకు అయన పాటలు ఎంతో దోహదం చేశాయి. దాసరి నారాయణరావు, టీ కృష్ణ, మాదాల రంగారావు సినిమాలతో పాటు అనేక చిత్రాలకు పాటలు రాశారు. ఆయన మరణంతో ఉత్తరాంధ్ర పాట ఊపిరి ఆగింది. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు, సాహిత్య లోకానికే కాదు.. పీడిత ప్రజానీకానికి, సమాజానికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అంటూ పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు.  (వంగపండు మృతికి సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం)

ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం ఉత్తరాంధ్రకు తీరని లోటని మిధునం సినిమా నిర్మాత ఆనంద్‌రావు అభిప్రాయపడ్డారు. అతని పాట వింటే ఊపు వస్తుందని..పేద ప్రజల గుండెచప్పుడు ఆ పాటలో కనిపిస్తుంది. ప్రజల కష్టాలను పాట రూపంలో ఓదార్చిన వ్యక్తి వంగపండు. అలాంటి ప్రజా గాయకుడు మళ్ళీ ఈ తరంలో కనిపిస్తారా. తన చిన్నతనంలో వంగపండు పాటలు పాడుకుంటూ ఎంతో ఉత్సాహాన్ని పొందేవాడినని నిర్మాత ఆనంద రావు అన్నారు.

మరిన్ని వార్తలు