శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

14 Aug, 2021 09:59 IST|Sakshi

శ్రీవారి దర్శనం చేసుకున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తెలుగు అకాడమీ చైర్మన్‌ లక్ష్మీపార్వతి

సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారిని  ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి శనివారం దర్శించుకున్నారు. అనంతరం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. కులమత వ్యత్యాసాలు లేకుండా.. పార్టీల విద్వేషాలు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆయన అన్నారు.

పేదవాడి ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలని, విద్యావంతులు కావాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని చెప్పారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్ని దేవాలయాలు పునరుద్దరించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు, పచ్చ మీడియా కలిసి సీఎం వైఎస్‌ జగన్‌ను మతాన్ని ఆపాదించడం చాలా తప్పు అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ పనిగట్టుకొని సీఎం జగన్ పై ఆరోపణలు చేయడం తగదని ఆయన హెచ్చరించారు. పేదలపై  ప్రేమ, ఆప్యాయత లేని వ్యక్తి  చంద్రబాబు అని.. ఒక్క పేద కుటుంబానికైనా ఇంటి స్థలాన్ని చంద్రబాబు ఇచ్చాడా అని  నారాయణ స్వామి ప్రశ్నించారు.

ఒక్క ఏడాదిలో తెలుగు అకాడమీ ఎన్నో విజయాలు సాధించింది:  లక్ష్మీ పార్వతి
తెలుగు బాషా చైతన్య సదస్సులు తిరుపతిలో నిర్వహించామని.. ఈ కార్యక్రమాల్లో సంస్కృత బాషా కవులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారని తెలుగు అకాడమీ చైర్మన్‌ లక్ష్మీ పార్వతి చెప్పారు. తెలుగు అకాడమీ పనితీరు చూసి తెలంగాణ ప్రభుత్వం కూడా ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఒక్క ఏడాదిలో తెలుగు అకాడమీ ఎన్నో విజయాలు సాధించిందని ఆమె తెలిపారు.

పుస్తకాల ప్రింటింగ్ పూర్తి అయిందిని.. మరో పదిరోజుల్లో పుస్తకాలను విద్యార్థులకు అందిస్తామని వెల్లడించారు. తిరుపతి కేంద్రంగా తెలుగు సంస్కృతి అకాడమీ బాధ్యతలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు అప్పగించారని ఆమె గుర్తు చేసుకున్నారు. లోయర్ క్లాస్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు తెలుగు తప్పనిసరి చేశామని స్పష్టం చేశారు. టీడిపీ ప్రభుత్వం వదిలేసిన తెలుగు అకాడమీని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తిరిగి  తీసుకొచ్చిందని ఆమె పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డిని నియమించడం పట్ల లక్ష్మీపార్వతి  ఆనందం వ్యక్తం చేశారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు