చిత్తు కాగితాలు ఏరే వారితో స్నేహం.. అనుకోకుండా వచ్చిన అవకాశంతో..

12 May, 2022 11:06 IST|Sakshi

అరుదైన అపురూప పుస్తకాలకు చిరునామా

జీవితమంతా పుస్తకాలతోనే సహవాసం

చెత్త కుప్పల్లో దొరికిన పుస్తకాలకూ కొత్త రూపు 

విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో ‘ప్రాచీనాంధ్ర గ్రంథమాల’ నిర్వహణ

నర్రా జగన్మోహనరావు జీవితం ఆదర్శప్రాయం

విజయవాడ లెనిన్‌ సెంటర్‌.. కాలువ ఒడ్డున వరుసకట్టిన పాత పుస్తకాల దుకాణాలు. అందులో 29వ నంబరు దుకాణం ‘ప్రాచీనాంధ్ర గ్రంథమాల’. ప్రాచీన సాహిత్యం, విజ్ఞానదాయక పుస్తకాలను గాలించేవాళ్లకు ఎడారిలో ఒయాసిస్సు ఆ దుకాణం. అరుదైన, అపురూపమైన పుస్తకాలకు చిరునామా అది. పుస్తక ప్రేమికులు కోరిన పుస్తకాన్ని గుర్తు పెట్టుకుని మరీ అప్పగించే నేస్తం ఆ దుకాణ యజమాని. దశాబ్దాలుగా పుస్తకంతో ముడిపడిన ఆయన జీవితంపై సాహిత్యాభిమానులు పనిగట్టుకుని పుస్తకం తీసుకొచ్చేందుకు పూనుకోవటం తాజా విశేషం. ఈ నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని ఘట్టాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
చదవండి: లెక్చరర్‌ పాడుబుద్ధి.. అధిక మార్కులు వచ్చేలా చూస్తానంటూ.. 

తెనాలి/గాంధీనగర్‌ (విజయవాడ): పుస్తకానికి సిసలైన నేస్తం ఆయన. పేరు నర్రా జగన్మోహనరావు. వయసు 69. ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుస్తక దుకాణంలోనే. పుస్తకాలపై పరచుకునే దుమ్మును దులుపుతూ, కొత్తగా వచ్చిన పాత పుస్తకాలను విభాగాలుగా సర్దుతూ, పాడైన వాటికి అట్టలు వేసి, పేర్లు రాస్తూ కనిపిస్తారాయన. ఏ పుస్తకం అడిగినా తీసివ్వడమే కాదు.. అందులో విశేషాలను ఏకరువు పెడతారు. మరేదైనా పుస్తకం లేదని చెప్పాల్సి వస్తే, ఆ బాధ ఆయన ముఖంలో కనిపిస్తుంది. అడిగిన అభిమాని ఫోన్‌ నంబరు తీసుకుని, ఆ పుస్తకం రాగానే పిలిచి మరీ అప్పగిస్తారు. కిరాణా దుకాణాల్లో పొట్లాలుగా, చెత్త యార్డుల్లో గుట్టల్లోనే అంతరించిపోయే పాత పుస్తకాలను పనిగట్టుకుని సేకరిస్తూ, వాటిని అపురూపంగా చూసుకునే వ్యక్తులకు అందిస్తున్నారు. ప్రచురణకర్తలకు అందజేసి పునర్‌ ముద్రణకూ దోహదపడుతున్నారు.

అలవాటు ఇష్టమై.. ఆపై ప్రాణమై.. 
పాత పుస్తకాన్ని ఇంత ప్రాణంగా చూసుకునే జగన్మోహనరావుకు గల పఠనాసక్తి ఈ వ్యాపారానికి పురిగొల్పింది. స్వగ్రామం గన్నవరం దగ్గరి ఆత్కూరు. జీవనోపాధికని విజయవాడలో స్థిరపడ్డారు. సినిమాలు, నాటకాలంటే వల్లమాలిన ప్రేమతో చదువు ప్రాథమిక పాఠశాలతోనే ముగిసింది. సినిమా చూట్టమే కాదు.. ఈ సినిమా పాటల పుస్తకాన్ని కొని, అందులోని పాటల మాధుర్యాన్ని ఆస్వాదించటం చిన్ననాటి అలవాటు. ఓ స్నేహితుడిచ్చిన నవలను చదివాక, పుస్తకాలు చదవటం అలవాటైంది. రకరకాల పుస్తకాలను చదివేయటం, పాత పుస్తకాలను సేకరించటం వ్యసనమైంది. ఉపాధి కోసమని పెట్టిన హోటల్‌ వ్యాపారం దెబ్బతింది. అప్పటికి తన దగ్గర విలువైన పుస్తక సంపద పోగుపడింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఆ పుస్తకాలను అమ్మేందుకని లెనిన్‌ సెంటరుకు వెళ్లిన జగన్మోహనరావుకు రెండు దశాబ్దాలకు పైగా అదే జీవితమైంది.

చిత్తు కాగితాలు ఏరే వారితో స్నేహం.. 
1998లో అనుకోకుండా వచ్చిన అవకాశంతో ఓ పాత పుస్తకాల దుకాణానికి యజమాని అయ్యారు. సొంత పుస్తకాలు ఎటూ ఉన్నాయి. మరిన్ని పుస్తకాల సేకరణకు ప్రణాళిక వేసుకున్నాడు. చిత్తుకాగితాలు ఏరేవారు, పాతపేపర్లు, పుస్తకాలు తూకానికి కొనేవారితోనే సాన్నిహిత్యం పెంచుకున్నాడు. వారు తెచ్చిన పాత పుస్తకాలకు తగిన ధరకు కొనేవాడు. సరిచేసి, చిరిగిపోతే బైండింగ్‌ చేసి అమ్మకానికి సిద్ధం చేయటం దినచర్యగా మారింది. పరిచయస్తుల్నుంచీ సేకరిస్తారు. ఆ విధంగా దుకాణంలో ఎప్పుడూ రూ.10 లక్షలకు పైగా విలువైన పుస్తకాలుంటాయి. అమ్మేవి అమ్ముతుంటే కొత్తగా పాత పుస్తకాలు వస్తుంటాయి.

జీవితం.. అక్షరబద్ధం.. 
అరుదైన ముద్రణలను ఊరికే వదిలేయకుండా ప్రత్యేక భద్రతా ప్రమాణాలతో పదిలం చేయాలని కేంద్ర ప్రభుత్వానికో లేఖ రాశారు జగన్మోహనరావు. పుస్తకానికి ఆయన చేస్తున్న సేవకు గుర్తింపుగా 2010లో గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య, డాక్టర్‌ వెలగా వెంకటప్పయ్య పురస్కారంతో సత్కారం అందుకున్నారు. వీరి విశిష్ట కృషికి రికార్డు చేయాలనే భావనతో సాహితీ ప్రేమికుడు అనిల్‌ బత్తుల (హైదరాబాద్‌), జర్నలిస్ట్‌ అనిల్‌ డ్యానీ (విజయవాడ)లు జగన్మోహనరావుపై తీసుకొస్తున్న ఈ పుస్తకం త్వరలో విడుదల కానుంది

సకలం లభ్యం..
ప్రాచీనాంధ్ర గ్రంథమాలలో పురాతన పుస్తకాలూ లభిస్తాయి. జాతక చింతామణి (1882), చంపూ భాగవతం (1874), మైత్రి సాత్వ, బ్రిటిష్‌ చరిత్ర, గోపాల్‌ మిత్తల్, మన తెలుగు భద్రాచల రామదాసు చరిత్రంబు (1879), తర్కశాస్త్రం (1883), మాఘమహాత్మ్యం (1889), సులక్షణసారము (1898), రఘువంశ మహాకావ్యమ్‌ వంటి పుస్తకాలు వీటిలో కొన్ని. విజయవాడకు వచ్చే సాహిత్యాభిమానుల్లో పలువురు ఈ దుకాణాన్ని తప్పక సందర్శిస్తారు. వీరిలో ఎన్నారైలూ ఉన్నారు. తమ రచనల కాపీలు అయిపోయిన రచయితలకు, వారి పుస్తకాన్ని ఇదే దుకాణంలో అందజేసిన సందర్భాలు ఉన్నాయి. ఎవరికైన పుస్తకాన్ని విక్రయిస్తే, వారి చిరునామా, ఫోను నంబరు, ఎలాంటి పుస్తకాలను వారు సేకరిస్తున్నారు.. ఎన్ని కొనుగోలు చేశారు.. అనే వివరాలను రాయిస్తున్నారు. వీటన్నిటికీ కలిపి ‘పుస్తక ప్రియులు–సేకరణానుభూతి’ పేరిట ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారాయన.

ఎప్పటి పుస్తకమైనా దొరుకుతుంది.. 
నగరంలో ఎక్కడా దొరకని పుస్తకాలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి. ‘సనాతన హైందవ ధర్మ జ్ఞానవాహిని’, కలియుగ దైవం కార్తికేయుడు’ ఈ రెండు పుస్తకాలను వారం రోజుల కిందటే అక్కడ కొనుగోలు చేశా. ఇక్కడ ఏ పుస్తకమైనా దొరుకుతుంది. ఒకవేళ పుస్తకం అందుబాటులో లేకపోయిన టైం తీసుకుని తెప్పించి ఇస్తారు. ఇక వాస్తుకు సంబంధించి 20, 30 ఏళ్ల కిందటి పుస్తకాలు కావాలంటే ఈ షాపునకు రావాల్సిందే. 
– సుధాస్వామి, కృష్ణలంక, విజయవాడ  

మరిన్ని వార్తలు