National Doctors Day 2022: వైద్యుడా... వందనం.. డాక్టర్స్‌ డే వెనుక చరిత్ర ఇదే 

1 Jul, 2022 20:14 IST|Sakshi

ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. మనిషికి ఎంత సంపద ఉన్నా దాన్ని అనుభవించే ఆరోగ్యం లేకపోతే అదంతా వృథాయే. అనారోగ్యంతో బాధపడే వారిని ప్రమాద స్థితి నుంచి కాపాడే శక్తి కేవలం వైద్యునికే ఉంది. అందుకే ప్రజలు వైద్యుడిని సాక్షాత్తు దేవుడిగా భావిస్తారు. ప్రాణాలు నిలిపినందుకు అతడిని దేవుడే అంటూ ప్రజలు దండాలు పెడతారు. పవిత్రమైన ఈ వృత్తిలో రాణిస్తూ విశేష సేవలు అందించే వైద్యులు చరిత్రలో నిలిచిపోతారు. నేడు వైద్యుల దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.
చదవండి: చింత చిగురు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

కడప కల్చరల్‌(వైఎస్సార్‌ జిల్లా): బెంగాల్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ బిదన్‌ చంద్రారాయ్‌ సంస్మరణగా  జాతీయ వైద్యుల దినోత్సవాన్ని దేశమంతటా నిర్వహిస్తున్నారు. ఆదర్శ వైద్యుడిగా ఆయనకుగల ఖ్యాతిని యేటా ఆయన జన్మదినం నాడు డాక్టర్స్‌ డేగా నిర్వహిస్తూ ఇతర వైద్యులు స్ఫూర్తి పొందేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బిదన్‌ చంద్రారాయ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారు. ఆయన 1882 జులై 1వ తేదిన జన్మించారు. 1962 జులై 1నే కన్నుమూశారు. 1991 నుంచి ఆయన సంస్మరణగా వైద్య లోకం డాక్టర్స్‌ డే నిర్వహిస్తోంది.

పవిత్రమైన వృత్తి
సమాజంలో అత్యంత పవిత్రమైన, కీలకమైన వృత్తి వైద్యం. ఆపద సమయంలో ప్రజలందరికీ ఆపద్బాం«ధవుడిలా కనిపించే వైద్యులను ప్రజలు ఎంతగానో గౌరవిస్తారు. సాక్షాత్తు దేవుడులాంటివాడివంటూ హృదయ పూర్వకంగా నమస్కారం చేస్తారు. అందుకే ఆయనను ‘వైద్యో నారాయణో హరి’ అంటూ గౌరవిస్తారు. అందుకే ఈ వృత్తికి సమాజంలో ప్రథమస్థానం ఉంది. తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది తమ పిల్లలను డాక్టర్‌ కమ్మని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇతరుల ప్రాణాలు నిలిపే అవకాశం డాక్టర్‌ వృత్తికి మాత్రమే ఉండడంతోపాటు ప్రస్తుత సమాజంలో ఆశించే ధనం కూడా ఈ వృత్తిలో పుష్కలంగా లభిస్తుంది. గనుక  వైద్య వృత్తికి అంతటి డిమాండ్‌ ఉంది.

పెరుగుతున్న కాలానికి అనుగుణంగా వైద్యుల సంఖ్య, మెడికల్‌ కళాశాలల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉంది. దీన్ని గుర్తించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం జిల్లాకో మెడికల్‌ కళాశాలను ప్రకటించింది. ఈ ప్రణాళిక సాకారమైతే రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ వైద్యుల కొరత ఉండదు.

దేవ వైద్యుడు
మానవులకే కాకుండా దేవతలకు కూడా వైద్యుడు ఉన్నాడు. ఆయనే ధన్వంతరి. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పుష్పగిరిలోని శ్రీ వైద్యనాథస్వామి ఆలయంలో మూల విరాట్‌ ఎదురుగా గోడపై ధన్వంతరి కుడ్య శిల్పం ఉంది. పురాణాలు ఆయనను దేవతల వైద్యునిగా పేర్కొంటున్నాయి. అందుకే ఈ దేవాలయంలోని శివునికి వైద్య నాథుడు అని పేరొచ్చింది.

ఒకప్పుడు దేవాలయాలే వైద్యాలయాలుగా కూడా సేవలు అందించేవి. చుట్టుపక్కలగల అడవుల్లో లభించే ఆకులు, గరుడు, వేర్లు తదితరాలను ఆలయాల అరుగులపై గుండ్రాళ్లతో మెత్తగా నూరేవారు. ఆ పసర్లతో స్థానికులకు వైద్యం చేసేవారని, అందుకు నిదర్శనంగా జిల్లాలోని పలు దేవాలయాల అరుగులపై నేటికీ మందులు నూరిన గుర్తుగా కల్వాలు (అరుగులపై మందును నూరిన గుర్తులు) కనిపిస్తాయి. పుష్పగిరిలోని వైద్య నాథస్వామి ఆలయానికి అప్పట్లో జిల్లా నలుమూలల నుంచి రోగులు వచ్చి వైద్య సేవలు పొందేవారని తెలుస్తోంది.

చరిత్రలో 
జిల్లాను బ్రిటీషు వారు పాలించే రోజుల్లో కడప నగరంలో హకీం మంజుమియాకు మంచి వైద్యునిగా పేరుంది. యునాని వైద్యునిగా ఆయన ఎంతో విశిష్ఠత సాధించారు. దేశం నలుమూలల నుంచి ప్రజలు వైద్యం పొందేందుకు ఆయన వద్దకు వచ్చేవారు. ప్రస్తుతం కడప నగరంలోని సిండికేట్‌బ్యాంకు ఉన్నచోట ఆయన వైద్యశాల ఉండేదని, పేదల వద్ద ఎలాంటి రుసుము తీసుకోకుండా మందులు కూడా ఉచితంగా ఇచ్చేవారని తెలుస్తోంది.

ఎందరో నవాబులు, రాజులు తమ సంస్థానానికి వస్తే పెద్ద ఎత్తున ధనం, గౌరవం ఇస్తామని ఆశ పెట్టినా ఆయన కడపలోని పేదలకు వైద్య సేవలు అందించాలని ఇక్కడే ఉండిపోయారు. ఆయన ప్రతిభ గురించి ఎన్నో విశేషమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రోగి స్వయంగా రాలేకపోయినా వారి తల వెంట్రుకగానీ, గోరుగానీ చూపితే వ్యాధి నిర్ధారణ చేసి రోగాలు నయం చేసేవారని ప్రచారంలో ఉంది. ముఖం చూసిన వెంటనే వ్యాధి ఏమిటో చెప్పగలిగే వారని కూడా ఆయనకు పేరుంది.

డాక్టర్ల వీధి
కడప నగరం క్రిస్టియన్‌లేన్‌కు డాక్టర్ల వీధిగా పేరుంది. దాదాపు వంద మీటర్ల పొడవు గల ఆ వీధిలో ఒక్కటంటే ఒక్కటి కూడా నివాస గృహం లేదంటే అతిశయోక్తి కాదు. రోడ్డుకు ఇరువైపుల దాదాపు అన్ని వైద్యశాలలే. అవిగాక స్కానింగ్‌ సెంటర్లు, ల్యాబోరేటరీలు, అడుగడుగునా మందుల దుకాణాలు ఉన్నాయి. తెలుగునాట ఇలాంటి వీధి మరేది లేదంటారు.  

మరిన్ని వార్తలు