‘డిండి’ సాగునీటి ప్రాజెక్టే..

5 Oct, 2021 03:58 IST|Sakshi

స్పష్టమవుతోందన్న జాతీయ హరిత ట్రిబ్యునల్‌

పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా ఉండాల్సిందే..

ఈ నెల 8లోగా కౌంటర్‌ దాఖలు చేయండి

సమయం కోరితే స్టే ఇవ్వాల్సి ఉంటుంది

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు

నూతన ప్రాజెక్టే, పర్యావరణ అనమతుల్లేవు: ఏపీ ఏజీ శ్రీరామ్‌

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని ‘డిండి’ ఎత్తిపోతల పథకం సాగునీటి ప్రాజెక్టు అని స్పష్టమవుతోందని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ అభిప్రాయపడింది. త్వరితగతిన వైఖరి చెప్పకుంటే స్టేటస్‌కో విధించాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పర్యావరణ చట్టాలు ఉల్లంఘించి అక్రమంగా చేపడుతున్న డిండి ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. డిండి ఎత్తిపోతల వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాజెక్టుల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు.

ఈ విషయాన్ని కృష్ణా బోర్డు, కేంద్ర జలశక్తి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదన్నారు. అంతర్రాష్ట్ర జలవివాదాలు పక్కనపెడితే.. అసలు ఈ పథకానికి పర్యావరణ అనుమతులు లేవని పేర్కొన్నారు. పర్యావరణ ప్రభావ అంచనా –2008 నోటిఫికేషన్‌ ప్రకారం పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా చేయలేదన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీలు తరలించి 3.60 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే లక్ష్యంతో 2015 జూన్‌లో తెలంగాణ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకం ప్రారంభించిందని చెప్పారు. ఈ వివరాలు తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కూడా ఉన్నాయన్నారు. పర్యావరణ అనుమతులు లేని ఈ ప్రాజెక్టు నిలిపి వేయాలని ఏజీ శ్రీరామ్‌ కోరారు. ఏపీ వాదనలపై తెలంగాణ వైఖరి చెప్పాలని ధర్మాసనం కోరింది.

మూడు వారాల సమయం కావాలన్న తెలంగాణ ఏఏజీ..
ఏపీ పిటిషన్‌పై ప్రాథమిక అభ్యంతరాలు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం తరఫు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రాంచందర్‌రావు తెలిపారు. మూడు వారాల సమయం కావాలని కోరగా ధర్మాసనం అనుమతి ఇవ్వలేదు. ప్రాథమికంగా ఇరిగేషన్‌ కాంపొనెంటు ఉందని అర్థం అవుతోందని, పర్యావరణ శాఖ అనుమతులు తప్పని సరిగా ఉండాలని స్పష్టం చేసింది. సమయం ఎక్కువ కోరితే స్టేటస్‌ కో విధిస్తామని పేర్కొంది. ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమయంలో ప్రారంభమైందని, కాలపరిమితి ముగిసిన తర్వాత పిటిషన్‌ దాఖలు చేశారు కాబట్టి విచారణకు అర్హత లేదని రాంచందర్‌రావు తెలిపారు.

ఈ తరహా పిటిషన్లు వ్యక్తులు దాఖలు చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కాదన్నారు. 2007లో ఈ ప్రాజెక్టుకు జీవోలు జారీ అయినప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో మళ్లీ జీవోలు ఇచ్చారని ఏపీ ఏజీ శ్రీరామ్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర పర్యావరణ శాఖ తదితరులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. ఈ నెల 8 లోగా వైఖరి చెప్పాలని ఆదేశిస్తూ అదే రోజుకు విచారణను వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు