ఆరోగ్య సంరక్షణలో వలంటీర్ల సేవలు భేష్‌

29 May, 2021 04:01 IST|Sakshi

జాతీయ ఆరోగ్య మిషన్‌ అభినందన

రాష్ట్రంలో మెరుగ్గా సాంకేతిక పరిజ్ఞానం వినియోగం

కరోనా సమయంలో విస్తృత సేవలు

ఏపీ ప్రభుత్వ విధానాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి ఇంటివద్దే సేవలందిస్తుండటాన్ని కేంద్ర ఆరోగ్య మిషన్‌ ప్రశంసించింది. ఆరోగ్య సేవలు పటిష్టం చేసేలా ఆశా కార్యకర్తలకు వారు సహకరిస్తున్నారని పేర్కొంది. రాష్ట్రంలో ఆరోగ్య సేవలు బాగున్నాయని కితాబిచ్చింది. జిల్లా ఆసుపత్రుల్లో టెలికన్సల్టేషన్‌ హబ్‌ల ఏర్పాటు, సబ్‌హెల్త్‌ సెంటర్లలో సాంకేతిక సేవలు వినియోగిస్తున్నట్లు తెలిపింది. ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లకు సంబంధించి ఏప్రిల్‌ 2018– నవంబరు 2020 వరకు వివరాలను మిషన్‌ వెల్లడించింది. ఆ వివరాలివీ...

జాతీయ సగటు కంటే మెరుగ్గా..
తల్లులు, నవజాత శిశువులు, పిల్లల ఆరోగ్య సూచికల్లో ఆంధ్రప్రదేశ్‌ జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉంది. రాష్ట్రంలో జీవనశైలి వ్యాధులు 60 శాతం, 12 శాతం వృద్ధుల జనాభా అంశాలు భారంగా ఉన్నాయి. నిర్దేశిత లక్ష్యంలో 40 శాతం సబ్‌ హెల్త్‌ సెంటర్లను రాష్ట్రం ఏర్పాటు చేసింది. విజయనగరం, విశాఖపట్నం, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో 549 హెల్త్, వెల్‌నెస్‌ సెంటర్లు నడుస్తున్నాయి. స్వయం సహాయక బృందాల ఉద్యమం ద్వారా మహిళా గ్రూపుల రాష్ట్ర వ్యాప్త నెట్‌వర్క్‌ను రూపొందించడంలో ఏపీ దేశానికి మార్గదర్శనం చేసింది. తద్వారా ఆరోగ్యం, సమాజ సంబంధాలు పెంచింది. రాష్ట్రంలో ఇటీవలే ఆశ కార్యకర్తలకు స్థిరమైన వేతనం ప్రకటించింది.

ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం..
ఆరోగ్య, సంరక్షణ కేంద్రాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో రాష్ట్రం ముందుంది. సబ్‌హెల్త్‌ సెంటర్, హెల్త్‌ వెల్త్‌ సెంటర్ల స్థాయిలో ఈ–ఔషధి వాడకం, జిల్లా ఆసుపత్రుల్లో టెలికన్సల్టేషన్‌ హబ్‌లు ఏర్పాటు చేసి ఈ–సంజీవని వినియోగిస్తోంది. ప్రజల సమాచారం సేకరణ నిమిత్తం సీపీహెచ్‌సీ–ఎన్‌సీడీ అప్లికేషన్‌ను వినియోగిస్తోంది. ఫిట్‌æ వర్కర్‌ ప్రచారంలో భాగంగా సేకరించిన హెల్త్‌ వర్కర్‌ స్క్రీనింగ్‌ డాటాను అనుసంధానించడానికి ఈ అప్లికేషన్‌ అభివృద్ధి చేస్తున్నారు. పట్టణ పీహెచ్‌సీలను ఈ–పీహెచ్‌సీలుగా మార్చారు. టెలికన్సల్టేషన్‌ సౌకర్యం, రోగుల వివరాలను సాంకేతిక  వ్యవస్థతో నిర్వహిస్తున్నారు. అన్ని గ్రామాల్లోనూ హెచ్‌డబ్ల్యూసీని ఏర్పాటు చేయాలని రాష్ట్రం యోచిస్తోంది.  కరోనా సమయంలో ఎస్‌హెచ్‌సీ–హెచ్‌డబ్ల్యూసీ బృందాలు ప్రజలకు సేవలు అందించడంతోపాటు ఇతర రోగులకు విస్తృత సేవలు అందించాయి. ఏపీ అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉన్నాయి. ప్రస్తుత పురోగతిని బట్టి డిసెంబరు 2022 నాటికి రాష్ట్రంలో అన్ని హెచ్‌డబ్ల్యూసీలు కార్యరూపంలోకి రానున్నాయి.

2,89,483 వెల్‌నెస్‌ సెషన్లు..
రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై ఆరోగ్య వైద్యసదుపాయాల కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.1,125 కాగా   కేంద్రం రూ.1,418 ఖర్చు చేస్తోంది. జనాభాను బట్టి ప్రాథమిక వైద్య సేవలకు సంబంధించి రాష్ట్రంలో 7,178 ఎస్‌హెచ్‌సీలు అవసరం కాగా 7,437 ఉన్నాయి. పీహెచ్‌సీలు 1,183కిగానూ 1,145 ఉన్నాయి.  అర్బన్‌ పీహెచ్‌సీలు 359కిగానూ 364 ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో 2,89,483 వెల్‌నెస్‌ సెషన్లు నిర్వహించారు.

మరిన్ని వార్తలు