దేశానికి ఏపీ మార్గదర్శకం

2 Jun, 2022 05:15 IST|Sakshi
ఎస్టీ పొదుపు సంఘాల మహిళలు, డీఆర్‌డీఏ అధికారులతో కేంద్ర బృందం

తిరుపతి అర్బన్‌: దేశానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తోందని జాతీయ గ్రామీణ జీవనోపాధి సంస్థ ప్రతినిధి శ్రేయమంజుధా అన్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర బృందం బుధవారం తిరుపతి డీఆర్‌డీఏ కార్యాలయంలో పొదుపు సహకార సంఘాలకు చెందిన ఎస్టీ మహిళలతో సమావేశమైంది. ఈ సందర్భంగా శ్రేయమంజుధా మాట్లాడుతూ.. తాము దేశంలోని అనేక రాష్ట్రాల్లో పర్యటించామని, చాలాచోట్ల మహిళా సంఘాలు బ్యాంక్‌ రుణాలు తీసుకోవడంతోనే సంఘాల పని పూర్తయినట్లు భావిస్తున్నాయని చెప్పారు.

ఏపీలో మహిళలకు బ్యాంక్‌ రుణాలతోపాటు వైఎస్సార్‌ బీమా, జగనన్న తోడు, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత వంటి పథకాలు వర్తింపచేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళల ఆర్థికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. పొదుపు సంఘాల ద్వారా వచ్చే రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో వచ్చే నగదుతో మహిళలు వ్యాపారులుగా మారడం పలు రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమన్నారు.

ఏపీ మహిళాభివృద్ధికి, వారి జీవనోపాధికి తీసుకుంటున్న చర్యలను కేంద్రానికి నివేదించి ఇలాంటి పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తే బాగుంటుందనే సూచనలు సైతం చేస్తామని చెప్పారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి సంస్థ ప్రతినిధులు కరిమైనాన్, మాన్‌కే ధవే మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. డీఆర్‌డీఏ జిల్లా ఇన్‌చార్జి ప్రాజెక్టు డైరెక్టర్‌ ప్రభావతి, డీఆర్‌డీఏ అధికారి ధనుంజయరెడ్డి ఉన్నారు. 

మరిన్ని వార్తలు