‘ఆ స్థాయి’ కేసులే దర్యాప్తు చేస్తాం

28 Apr, 2022 05:13 IST|Sakshi

మానవ అక్రమ రవాణాపై  హైకోర్టుకు నివేదించిన జాతీయ దర్యాప్తు సంస్థ

తదుపరి విచారణ మే 4కి వాయిదా

సాక్షి, అమరావతి: మానవ అక్రమ రవాణాకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యవసానాలు ఎదురయ్యే కేసులను మాత్రమే తాము దర్యాప్తు చేస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) హైకోర్టుకు నివేదించింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మూడునెలల ఆడ శిశువును రెండునెలల్లో ఏడుసార్లు విక్రయించిన ఘటనపై మంగళగిరి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యవసానాలు ఎదురయ్యేంత కేసు కాదని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత కేసులో ఆదేశాలు జారీచేయాలని కోరింది.

ఈ మేరకు ఎన్‌ఐఏ ఎస్‌పీ వి.విక్రమన్‌ హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. శిశు విక్రయాలపై స్పందించిన హైకోర్టు మంగళగిరికి చెందిన మేడబలిమి మనోజ్‌ తన మూడునెలల ఆడ శిశువును, ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన జి.చిలకమ్మ అనే మహిళకు పుట్టిన శిశువును  పలువురికి విక్రయించారు. వీటికి సంబంధించి పత్రికల్లో కథనాలు ప్రచురితం కావడంతో హైకోర్టు సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యాలుగా పరిగణించిన విషయం తెలిసిందే.

ఇటీవల ఈ వ్యాజ్యాలపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్‌ఐఏ, సీబీఐలకు నోటీసులు జారీచేసింది. బుధవారం మరోసారి విచారణకు రాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్‌ కౌంటర్‌ దాఖలుకు గడువు కోరారు. ధర్మాసనం అంగీకరిçస్తూ విచారణను మే 4కు వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు