విభిన్న ప్రతిభావంతుల కోసం ‘నల్సా’ కొత్త పథకం 

27 Aug, 2022 12:18 IST|Sakshi

కడప అర్బన్‌ : విభిన్న ప్రతిభావంతుల కోసం జాతీయ న్యాయ సేవాధికారసంస్థ (నల్సా) కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్‌. కవిత తెలిపారు. శుక్రవారం కడపలోని జిల్లా కోర్టు ఆవరణలో న్యాయసేవాసదన్‌లో విభిన్న ప్రతిభావంతుల కోసం నల్సా రూపొందించిన న్యాయ సేవలు పథకం 2021పై అవగాహన సదస్సు నిర్వహించారు. జడ్జి కవిత మాట్లాడుతూ ఈ పథకం గురించి విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిలో భాగంగా మానసిక, శారీరక దివ్యాంగులైన పిల్లల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 

విభిన్న ప్రతిభావంతులైన పిల్లల పట్ల వివక్ష  చూపరాదని, 18 సంవత్సరాలు వచ్చేంతవరకు ఉచిత విద్యను అందించాలన్నారు. వీరికి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రవేశాలు, ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్నారు.  న్యాయసేవలు ఉచితంగా అందజేస్తామన్నారు. కొత్తపథకంపై పాఠశాలలు, ఆసుపత్రులు, పంచాయతీ కార్యాలయాల్లో బోర్డులు ప్రదర్శించాలని జడ్జి వివరించారు.

కార్యక్రమంలో భాగంగా అంధులైన పిల్లలకు డైజీ ప్లేయర్స్, విభిన్న ప్రతిభావంతులైన పిల్లలకు టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్స్, వీల్‌ చైర్స్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు,  వారి తల్లిదండ్రులు, వెల్ఫేర్‌ ఆఫ్‌ డిఫరెంట్లీ ఆబ్లెడ్‌ ట్రాన్స్‌జెండర్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్, ఎస్‌ఎస్‌ఏ పీఓ ప్రభాకర్‌రెడ్డి, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఖాదర్‌బాష, అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి. నరసింహులు, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ సాంబశివరావు, లీగల్‌ కమ్‌ ప్రొహిబిషన్‌ ఆఫీసర్‌ సునీతరాజ్, అన్నమయ్య జిల్లా డీసీపీఓ సుభాష్‌యాదవ్, జిల్లా ప్రొహిబిషన్‌ ఆఫీసర్‌ చెన్నారెడ్డి, రాష్ట్రీయ సేవాసమితి, ఆల్‌షిఫా ఇనిస్టిట్యూట్‌ కరస్పాండెంట్‌ రఫి, హెలెన్‌కెల్లర్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూట్‌ సిబ్బంది పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు