Krishna: మూడు రోజుల పాటు జాతీయ ఆర్గానిక్‌ మేళా  

7 Jan, 2022 11:05 IST|Sakshi

సాక్షి, అమరావతి: సేంద్రియ సాగుకు ప్రోత్సాహం, ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా విజయవాడలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ‘4వ జాతీయ ఆర్గానిక్‌ మేళా నిర్వహిస్తున్నారు. ఏపీ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న ఈ మేళాను మిజోరాం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు ప్రారంభిస్తారు.

ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా రైతులు స్టాల్స్‌ ఏర్పాటు చేసేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో సాగవుతున్న సేంద్రియ ఆహార ఉత్పత్తులు, మొక్కలు, దుస్తులు, మెడిసిన్స్‌తో పాటు యంత్ర పరికరాలను ప్రదర్శించనున్నారు. ఇందులో ఏపీ ప్రభుత్వం కూడా భాగస్వామి కాబోతోంది.

రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళా సంఘాలు, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. అలాగే జై కిసాన్‌ ఆధ్వర్యంలో ఆదర్శ రైతులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పాత్రికేయులను సత్కరించనున్నారు. శనివారం మిద్దెతోటల సాగుపై వ్యవసాయ, ఉద్యాన రంగ నిపుణులతో సెమినార్‌ నిర్వహిస్తారు.

ఆదివారం ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అనే అంశంపై డాక్టర్‌ రామచంద్రరావు ప్రసంగిస్తా రు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వహణ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ, గో ఆధారి త వ్యవసాయదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రామకృష్ణంరాజు, భారతీయ కిసాన్‌ సంఘం అధ్యక్షుడు జె.కుమారస్వామి కోరారు.    

మరిన్ని వార్తలు