Andhra Pradesh: ఆరోగ్య సేవలు భేష్‌

4 Oct, 2021 03:20 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న జయలాల్‌

సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని ముందంజలో నిలిపారు

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు జయలాల్‌

డాబా గార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సేవలు భేషుగ్గా ఉన్నాయని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు జయలాల్‌ అన్నారు. విశాఖలోని అంకోశా గెస్ట్‌ హౌస్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాన్యుడికి వైద్యం అందివ్వాలన్న మంచి ఉద్దేశంతో వాడవాడలా ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించడం శుభపరిణామమన్నారు. సీఎం జగన్‌ వైద్య సేవల విషయంలో రాష్ట్రాన్ని ముందంజలో నిలుపుతున్నారని కొనియాడారు. కోవిడ్‌ సేవలందిస్తూ మృతి చెందిన హెల్త్‌ వర్కర్లకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ కింద రూ.50 లక్షలు ఇన్సూరెన్స్‌ ప్రకటించినప్పటికీ అమలు కావడం లేదన్నారు. కోవిడ్‌ బారిన పడి మరణించిన వైద్యులను గుర్తించి.. వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

వైద్య సేవలందించే క్రమంలో అనుకోకుండా రోగి మృత్యువాత పడితే.. వైద్యులు, ఆస్పత్రులపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైద్యులకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని, వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. హోమియోపతిని ఐఎంఏ వ్యతిరేకించడం లేదన్నారు. మిక్సోపతిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఐఎంఏ గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జేయిష్‌ లేలే, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు