Coral Reefs: ఏపీలో అరుదైన పగడపు దిబ్బలు.. ఎక్కడ ఉన్నాయంటే?

19 Jun, 2022 09:58 IST|Sakshi
సాగర గర్భంలో కనుగొన్న పగడపుదిబ్బలు

పగడపు దిబ్బల..పూడిమడక..!

ఏపీ తీరంలో కోరల్స్‌ను గుర్తించిన జాతీయ బృందం

పర్యావరణ అధ్యయనం నిర్వహించిన జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా

పూడిమడక నుంచి చింతపల్లి వరకు అధ్యయనం

పూడిమడకలో స్కెలరాక్టినియా పగడాలు

విభిన్న జాతుల వైవిధ్య సముదాయంగా తీరం ఉందని నివేదిక

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ తీరంలో ఎక్కడా లేని విభిన్న పగడపు దిబ్బలకు చిరునామాగా విశాఖపట్నం జిల్లా పూడిమడక మారింది. కోస్తా తీరంలో పగడపు దిబ్బలు అస్సలుండవు అనే మాట తప్పని జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జెడ్‌ఎస్‌ఐ) పరిశోధనలు నిరూపించాయి. ఒకే ప్రాంతంలో విభిన్న రకాల కోరల్స్‌(పగడపు దిబ్బలు) ఉన్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు.. వీటిని మరోచోటికి తరలించి అభివృద్ధి చేసేందుకు కూడా అనువుగా ఉన్నాయని స్పష్టం చేశారు.
చదవండి: ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి తర్వాత అందంగా లేదని.. దారుణంగా

రాష్ట్రంలో  జెడ్‌ఎస్‌ఐ.. విశాఖ జిల్లా పూడిమడక నుంచి విజయనగరం జిల్లా చింతపల్లి తీరం వరకు సర్వే నిర్వహించగా.. ఈ ప్రాంతమంతా విభిన్న జాతుల వైవిధ్య సముదాయంగా ఉందని స్పష్టమయ్యింది. భారతీయ పగడాల వర్గీకరణపై నిరంతర పరిశోధన చేస్తున్న జెడ్‌ఎస్‌ఐ మొట్టమొదటిసారిగా ఆంధ్రా తీరంలో 2020 నుంచి ప్రతి ఏటా జనవరి 17 నుంచి 26వ తేదీ వరకు మూడేళ్ల పాటు సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక అంశాలు వెల్లడయ్యాయి.

విభిన్న రకాల పగడపు దిబ్బలు.. 
పూడిమడక, భీమిలి, రుషికొండ, యారాడ, కైలాసగిరి, సాగర్‌నగర్, ఆర్‌కేబీచ్, మంగమూరిపేట, తెన్నేటిపార్కు, చింతపల్లి బీచ్‌లలో ఒక్కో ప్రాంతంలో నాలుగు భిన్నమైన ప్రదేశాల్ని సర్వే పాయింట్లుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 30 మీటర్ల లోతులో సాగరగర్భంలో అన్వేషణ సాగించారు. స్థానిక స్కూబాడైవింగ్‌ సంస్థ లివిన్‌ అడ్వెంచర్స్‌ సహకారంతో నలుగురు శాస్త్రవేత్తల బృందం చేపట్టిన సర్వేలో పూడిమడక కేంద్రంగా విభిన్న పగడపు దిబ్బలున్నట్లు గుర్తించారు. స్కెలరాక్టినియా కోరల్స్, పవోనాఎస్‌పీ, లిథోపిలాన్‌ ఎస్‌పీ, మోంటీపోరా ఎస్‌పీ, పోరిటెస్‌ ఎస్‌పీ, హెక్సాకోరిలియా, ఆక్టోకోరలియా, డిస్కోసోమా, లోబాక్టిస్‌ వంటి అరుదైన పగడపు దిబ్బలున్నట్లు కనుగొన్నారు.

సాగర గర్భంలో కనుగొన్న పగడపుదిబ్బలు 

మరోచోట పెంచుకునేందుకు వీలుగా.. 
ఒక చోట పెరిగే పగడపు దిబ్బల్ని కొంత భాగం తీసి.. మరోచోట పెంచే రకాలు అరుదుగా ఉంటాయి. ఇలాంటి అరుదైన కోరల్స్‌ పూడిమడకలో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. ఈ తరహా కోరల్స్‌.. మేరీటైమ్‌ మెడిసిన్‌ తయారీకీ  ఉపయోగపడతాయని గుర్తించారు.  ప్రతి ఏటా 9 రోజుల పాటు ఆయా బీచ్‌లలో సబ్‌–టైడల్, ఇంటర్‌–టైడల్‌ ప్రాంతాల్లో సర్వే నిర్వహించి.. విభిన్న జీవరాశులకు సంబంధించిన నమూనాలు సేకరించారు. 1,597 మొలస్కా జాతులు, 182 సినిడారియన్, 161 స్పాంజ్, 133 రకాల చేపలు, 106 క్రస్టేసియన్‌లు, 12 అసిడియన్‌లు, 3 ఫ్లాట్‌ వార్మ్‌లతో పాటు.. అన్నెలిడ్‌ జీవజాతుల నమూనాల్ని సేకరించారు.

మత్స్యసంపదకు ఉపయుక్తం.. 
సముద్ర గర్భంలో పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలుగా పగడపు దిబ్బల్ని పిలుస్తారు. పగడాల ద్వారా స్రవించే కాల్షియం కార్బోనేట్‌ నిర్మాణాల వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి కొన్ని పోషకాలను కలిగి ఉంటాయి. పగడపు దిబ్బలు సముద్రగర్భంలో అత్యంత వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. ఇవి ఉంటే.. సముద్ర జీవరాశులు ఎక్కువగా పెరిగేందుకు ఉపయోగపడతాయి.

విభిన్న జీవరాశుల సమాహారం...
పూడిమడక తీరం విభిన్న జీవరాశులతో కళకళలాడుతోందని జెడ్‌ఎస్‌ఐ సర్వేలో వెల్లడైంది. విదేశీ తీరాల్లో కనిపించే సూక్ష్మ జాతి సముద్ర జీవ రాశులు కూడా పూడిమడకలో ఉన్నట్లుగా గుర్తించారు. పీత జాతికి చెందిన అరుదైన తెనస్, స్పాంజ్, స్టార్‌ఫిష్, ఇండో పసిఫిక్‌ సముద్రంలో ఉండే స్టోమోప్నిస్టెస్‌ సముద్రపు ఆర్చిన్‌లు, సీ బటర్‌ఫ్లైస్‌గా పిలిచే హెనియోకస్‌ చేపలు, ఒంటెరొయ్యలు.. ఇలా భిన్నమైన జీవజాలంతో పూడిమడక తీరం అద్భుతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు నివేదికలో పొందుపరిచారు.

మరోసారి సర్వే.. 
పూడిమడక తీరం.. విభిన్న సముద్ర జీవజాతుల సమాహారంగా ఉంది. ఇక్కడ ఉన్న పగడపు దిబ్బలు చాలా అరుదైన రకాలు. ఈ తరహా సముద్ర గర్భ వాతావరణం ఇక్కడ ఉండటం నిజంగా ఆశ్చర్యకరం. మొత్తం డాక్యుమెంటేషన్‌ నిర్వహించాం. ఇక్కడి కోరల్స్‌.. సముద్ర పర్యాటకానికి, వైద్యరంగంలో ఔషదాల తయారీకి, మెరైన్‌ రిలేటెడ్‌ రీసెర్చ్‌కు ఎంతగానో ఉపయోగపడతాయి. వచ్చే ఏడాది మరోసారి లోతైన అధ్యయనం చేయాలని భావిస్తున్నాం.
– డాక్టర్‌ జేఎస్‌ యోగేష్‌ కుమార్, జెడ్‌ఎస్‌ఐ సీనియర్‌ సైంటిస్ట్‌

చింతపల్లి వరకు అరుదైన జీవజాలం
జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వహించిన పరిశోధనలకు రాష్ట్రం తరఫున పూర్తి సహకారం అందించాం. పూడిమడక నుంచి చింతపల్లి వరకు ప్రతి ప్రాంతం విభిన్న రకాల జీవజాతులతో అద్భుతంగా కనిపించాయి. 30 మీటర్ల లోతు వరకు పగడపు దిబ్బల్లో ఉన్న జంతుజాలం ఫొటోల్ని జెడ్‌ఎస్‌ఐకి అందించాం. రీఫ్‌లు, కోరల్స్‌ ద్వారా.. మత్స్యసంపద చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. అయితే కాలుష్యం బారిన పడకుండా వీటిని సంరక్షించుకోవాలి.
– బలరాం, లివిన్‌ అడ్వెంచర్స్‌  స్కూబా ఇన్‌స్ట్రక్టర్‌ 

మరిన్ని వార్తలు