పెళ్లి కోసం పట్నాలకు వలసలు

21 Aug, 2022 03:37 IST|Sakshi

గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరగడానికి ప్రధాన కారణం పెళ్లిళ్లే

47.5% వలసలకు కారణం ఇదే..

వలసల్లో అత్యధికులు మహిళలే 

ఉద్యోగం, ఉపాధి కోసం వలస వెళ్లిన వారు 10.8 శాతమే 

చదువుల కోసం వెళ్తున్నది రెండున్నర శాతమే 

వలసలపై దేశవ్యాప్త సర్వే వివరాలు వెల్లడించిన కేంద్రం

సాక్షి, అమరావతి: పల్లెటూళ్ల నుంచి పట్టణాలకు ఎవరన్నా వలస పోతున్నారంటే.. ఉద్యోగం, ఉపాధి పనుల కోసమో.. అదీ కాకుంటే పిల్లల ఉన్నత చదువుల కోసమో అని అందరూ అనుకుంటుంటారు. కానీ.. అది వాస్తవం కాదట. 2020 జూలై నుంచి 2021 జూన్‌ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న వలసలపై కేంద్రం నిర్వహించిన పీరియాడికల్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌)లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కేంద్రం ప్రత్యేకంగా నిర్వహించిన సర్వేలో నూటికి 47.5 శాతం మంది పెళ్లిళ్ల కారణంగానే పట్టణాలకు వలస వెళ్లినట్టు తేలింది. అంటే దాదాపు మొత్తం వలసల్లో సగం మంది వలసలకు ఇదే కారణమని స్పష్టమైంది.  

ఉపాధి.. ఉద్యోగాల కోసం వెళ్లేది 10.8 శాతమే
► ‘ఉపాధి హామీ పథకం–గ్రామాల్లో వలసలు’ అనే అంశంపై రెండు రోజుల క్రితం లోక్‌సభలో చర్చకు రాగా.. కేంద్ర ప్రభుత్వం ఈ సర్వే వివరాలను అధికారికంగా వెల్లడించింది.  
► 2020–21 మధ్య పల్లెటూళ్ల నుంచి పట్టణాలకు వలస వెళ్లిన వారు 47.5 శాతం కాగా.. వారిలో మహిళల సంఖ్య అధికంగా ఉందని పేర్కొంది.  
► ఉద్యోగ, ఉపాధి మార్గాల కోసం పట్నం వెళ్లిన వారి సంఖ్య కేవలం 10.8 శాతమే అని తెలిపింది. 
► పిల్లల చదువుల నిమిత్తం పట్టణాలకు వలస వెళ్తున్న వారు 2.4 శాతం మంది ఉన్నట్టు పేర్కొంది. 
► సంపాదించే కుటుంబ యజమాని స్థల మార్పిడి కారణంగా 20 శాతం మంది పట్టణాలకు చేరుకున్నారని వెల్లడించింది. 
► 2020 మార్చిలో కరోనా కారణంగా దేశవ్యాప్తంగా కేంద్రం లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అదే ఏడాది జూలై నాటికి లాక్‌డౌన్‌ నిబంధనలను చాలావరకు కేంద్రం సడలించింది. ఆ తరువాత చోటుచేసుకున్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకే కేంద్రం ఈ సర్వే చేయించింది. 
► అప్పట్లో పట్నాల నుంచి పల్లెటూరు వెళ్లిన వారి సంఖ్యతో పాటు పల్లెల నుంచి పట్టణాలకు వచ్చిన వారి వివరాలను కూడా ఈ సర్వే ద్వారా కేంద్రం గుర్తించింది.  
► మొత్తం 122 కోట్ల దేశ జనాభాలో 0.7 శాతం మంది అంటే 85 లక్షల మంది సర్వే జరిగిన ఆ ఏడాది కాలంలో తాత్కాలికంగా వలస బాట పట్టారని తేల్చింది. 

పట్నం బాట పట్టడానికి కారణాలు.. వలస వెళ్లిన వారి శాతం 

మరిన్ని వార్తలు