తక్కువ సమయంలో అధిక ఆదాయం.. నెలకు లాభం ఎంతంటే?

7 Dec, 2022 16:12 IST|Sakshi

కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): మహిళల స్వయం ఉపాధే లక్ష్యంగా  ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. తాజాగా స్వయం సహాయక సంఘాల్లో ఔత్సాహికుల కోసం పెరటికోళ్ల పెంపకం(లైవ్‌స్టాక్‌) పథకాన్ని ప్రవేశపెట్టింది. పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఆవులు, గొర్రెల పంపిణీ మాదిరగా మేలుజాతి పెరటి కోళ్లను ఈ పథకం ద్వారా రాయితీపై పంపిణీ చేయనుంది. ఇప్పటికే జిల్లాలో వెలుగు కార్యాలయాల వద్ద లైవ్‌స్టాక్‌ యూనిట్ల పంపిణీ సైతం ప్రారంభమైంది.    

పెరట్లోనే ఆదాయం.. 
పెరటి కోళ్ల పెంపకం అనేది మహిళలకు తక్కువ సమయంలో మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీగా ఉండే వారు నెలకు రూ.10వేలు వరకు సంపాదించుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇంటి వద్ద తినిపడేసే వ్యర్థ పదార్థాలతో పాటు పథకం కింద అందజేసే దాణాను కోళ్లకు ఆహారంగా వేస్తే సరిపోతుంది. బాయిలర్‌ కోడి గుడ్డు రూ.5 ధర పలుకుతుంటే, ఈ దేశవాళీ పెరటి కోడి గుడ్లు ఒక్కొక్కటి రూ.10 వరకు పలుకుతుంది. సాధారణ కోళ్ల కంటే రెట్టింపు బరువుతో మాంసం అమ్మకానికి ఉపయోగపడతాయి. కుక్కల బెడద నుంచి కాపాడుకుంటే సరిపోతుంది.

యూనిట్ల కోసం దరఖాస్తు ఇలా.. 
పెరటి కోళ్ల పెంపకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వీటిని సబ్సిడీపై సమకూరుస్తుంటే వాటి రక్షణ, వ్యాక్సినేషన్‌ ఇతర బాధ్యతలు పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ చూస్తోంది.

మండల కేంద్రాల్లోని వెలుగు కార్యాలయంలో ఏపీఎంలకు గ్రామాల్లోని సీఎఫ్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

లబ్ధిదారులకు వాహనం ద్వారా కోళ్లు సరఫరా చేస్తారు. సంరక్షణ నియమావళి, ఇతర సౌకర్యాలను అధికారులే వివరిస్తారు

యూనిట్‌ ధర రూ.3970. ఇందులో ఎనిమిది కోడిపెట్టలు, మూడు కోడి పుంజులు ఉంటాయి. ఒక్కో కోడి నాలుగు కేజీల బరువు వరకు పెరుగుతాయి. ఆరోగ్య పరిస్థితి బట్టి 160 నుంచి 180 వరకు గుడ్లు పెడతాయి. వీటితో పాటు 30 కేజీల దాణా అందించనున్నారు. మార్కెట్‌లో కిలో దాణా రూ.240 వరకు పలుకుతుంది.

కోళ్లు ఎటువంటి అనారోగ్యం కాకుండా నలభై రోజులు వరకు పనిచేసే డీ వార్మింగ్‌– ఎండీ వ్యాక్సినేషన్‌ చేయించి అందిస్తారు.  మెడికల్‌ కిట్లు సైతం సరఫరా చేస్తారు. ఇందులో లివర్‌ టానిక్, బి–కాంప్లెక్సు వంటి యాంటి బయాటిక్‌లు ఉంటాయి.
చదవండి: ‘ఇది ట్రైలర్‌ మాత్రమే.. అసలు సినిమా ముందుంది’

చురుగ్గా గుర్తింపు ప్రక్రియ 
జిల్లాలోని 25 మండలాలకు గాను 2500 యూనిట్లను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేసింది. మండలానికి తొలిదశలో భాగంగా 100 యూనిట్లు మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే పలు మండలాల్లో 1530 యూనిట్లకు సరఫరా చేసేందుకు లబ్దిదారుల గుర్తింపు జరిగింది. పలాస మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనం వద్ద పథకం తొలి విడత పంపిణీ ప్రారంభమైంది.

ఏపీఎంలను సంప్రదించాలి 
పెరటికోళ్ల పెంపకం ఇటీవలే ప్రారంభమైంది. మండలాల వారిగా కోళ్ల పంపిణీ జరుగుతోంది. యూనిట్ల కోసం వెలుగు కార్యాలయంలో ఉన్న ఏపీఎంలను సంప్రదించాలి. 
– డాక్టర్‌ మోతిక సన్యాసిరావు, డీఆర్‌డీఏ డీపీఎం, శ్రీకాకుళం   

మరిన్ని వార్తలు