ప్రపంచ శిఖరాగ్రాలపై ‘నవరత్నాలు’ 

3 Feb, 2023 05:50 IST|Sakshi

అంటార్కిటాలోని విన్షన్‌ పర్వతంపై రాష్ట్ర ప్రభుత్వ నవరత్నాల జెండా ఎగురవేసిన విశాఖ యువకుడు అన్మిష్‌వర్మ

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రపంచంలోని ఏడు ఎత్తయిన పర్వతాలపై రాష్ట్ర ప్రభుత్వ ‘నవరత్నాల’ జెండాను విశాఖపట్నం యువకుడు భూపతిరాజు అన్మిష్‌­వర్మ ఎగురవేశాడు. మార్షల్స్‌లో ప్రపంచ పత­కాలు సాధించిన అన్మిష్‌వర్మ 2020 నుంచి ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాలను అధిరోహించ­డం ప్రారంభించాడు. గత రెండేళ్లలో ఆఫ్రికాలోని కిలి­­మంజారో, సౌత్‌ అమెరికాలోని అకాంకోగోవా, నేపాల్‌లోని ఎవ­రెస్ట్, యూరప్‌లోని ఎల్‌బ్రూస్, నార్త్‌ అమెరికాలోని డె­నాలి, ఆస్ట్రేలియాలోని కొసి­యస్‌కో పర్వతాలను అధి­రోహించి అక్కడ రాష్ట్ర ప్రభుత్వ నవరత్నాల జెండాను ఎగురవేశాడు.

తా­జా­గా ఈ ఏడాది జనవరి 22న అంటార్కిటాలోని విన్షన్‌ పర్వతాన్ని అధిరోహించి జాతీయ జెండాతోపాటు ఆంధ్ర రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాల జెండాను ఎగురవేశాడు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలకుగాను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌    రెడ్డికి కృతజ్ఞతలు తెలిపే బ్యానర్లను ప్రదర్శించాడు.

లండన్, చెక్‌ రిపబ్లిక్, అమెరికాకు చెందిన ముగ్గురు పర్వతారోహకులతో కలిసి అన్మిష్‌వర్మ ఈ పర్వతాన్ని అధిరోహించాడు. అన్మిష్‌వర్మ తండ్రి వేణుగోపాలరాజు మిలటరీలో పనిచేశారు. తల్లి సత్యవేణి గృహిణి. విశాఖపట్నంలోని బిట్స్‌ కాలేజీలో ఎంబీఏ పూర్తిచేసిన అన్మిష్‌వర్మ  ఇప్పటివరకు దేశానికి రెండు ప్రపంచ పతకాలను అందించాడు. తాజాగా ప్రపంచంలోని ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించి మరో రికార్డు సృష్టించాడు. 

మరిన్ని వార్తలు