నాడు కూలీ.. నేడు వ్యాపారి.. నవరత్నాలతో ఆర్థిక స్వావలంబన

26 Apr, 2022 10:53 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మహిళలు శ్రీమంతులయ్యారు. కుటుంబాలను చక్కదిద్దుకున్నారు. సమాజంలో గౌరవంగాబతుకుతున్నారు. చిరు వ్యాపారాలు చేస్తూ కొందరు, చేతి వృత్తుల్లో రాణిస్తూ మరికొందరు, పశు పోషణలో పట్టు సాధిస్తూ ఇంకొందరు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.

కర్నూలు(అర్బన్‌): మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. నవరత్నాల్లో భాగంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. మహిళల బ్యాంక్‌ ఖాతాల్లోకి కోట్లాది రూపాయల నిధులను జమచేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు ఈ నిధులను సద్వినియోగం చేసుకుంటున్నారు. తమ జీవనోపాధులను మెరుగుపరచుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు రోజుకు 100 రూపాయల కూలికి వెళ్లిన అనేక మంది మహిళలు నేడు చిరు వ్యాపారులయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలు, ఆర్థిక సహకారంతో స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు. సమాజంలో ఉన్నతంగా జీవిస్తున్నారు. పిల్లలను ఉన్నత విద్య చదివిస్తున్నారు.  

ఆర్థికాభివృద్ధికి ‘చేయూత’ 
వైఎస్సార్‌ చేయూత పథకంతో 45 నుంచి 60 ఏళ్లలోపు వయస్సు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళల జీవితాలు మెరుగుపడ్డాయి. అర్హులైన వారి ఖాతాలో ఏటా ప్రభుత్వం రూ. 18,750 జమ చేస్తోంది. అంతేకాకుండా బ్యాంకుల ద్వారా రుణం కూడా ఇప్పిస్తోంది. వైఎస్సార్‌ చేయూత కింద  ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో 1,98,480 మందికి రూ. 372.15 కోట్లు, 2021–22 మొదటి విడతలో 1,91,783 మందికి రూ.359.59 కోట్లు, 2021–22 రెండవ విడతలో 21,674 మందికి రూ.40.64 కోట్లను ప్రభుత్వం అందజేసింది. చేయూత పథకం కింద బ్యాంకుల ద్వారా అందిన రుణంతో 3,251 మంది మహిళలు కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం 2,727 కిరాణా దుకాణాలకు 12.10 కోట్ల రుణాలు మంజూరు చేసింది. లబ్ధిదారులకు వైఎస్సార్‌ చేయూత జీవన క్రాంతి పథకంలో భాగంగా  16,004 యూనిట్ల పాడి పశువులు, గొర్రెలు, మేకలను ఇప్పించారు.   

చేతి వృత్తులకు ‘చేదోడు’ 
బీసీ కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న చేదోడు, వైఎస్సార్‌ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల ద్వారా రూ. 96.47 కోట్లను ఇప్పటి వరకు విడుదల చేసింది. 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాల్లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని మొత్తం 47,550 మంది రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్లకు జగనన్న చేదోడు ద్వారా ఒక్కొక్కరికి రూ.10 వేల ప్రకారం మొత్తం రూ.47.55 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన కాపు, ఒంటరి, తెలగ కులాలకు చెందిన 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు కాపు నేస్తంలో భాగంగా ఒక్కొక్కరికి రూ.15 వేల ప్రకారం రూ.18,28,50,000 విడుదల చేశారు. అగ్రవర్ణ పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక చేయూతను అందించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈబీసీ నేస్తం పథకం కింద 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.30,64,50,000 విడుదల చేశారు.  

ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యం  
గత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులకు గురైన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్‌ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్యకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఈ నేపథ్యంలో సంక్షేమ క్యాలెండర్‌లో ప్రకటించిన విధంగానే నవరత్నాల్లో భాగంగా జగనన్న వసతి, విద్యా దీవెన పేరుతో ఆయా వర్గాలకు చెందిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి 2019– 20 నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరం వరకు దాదాపు రూ.559.49.46,813 జమ చేసింది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన అనేక మంది పేదింటి బిడ్డలు నేడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, డాక్టర్లు, ఇతరత్రా ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్‌లో ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందిస్తున్నారు

ఉన్నత విద్యకు మార్గం సుగమం  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విద్యా, వసతి దీవెన కార్యక్రమాలతో నాలాంటి ఎంతో మంది పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలు కలుగుతోంది. భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తూ నన్ను చదివిస్తున్నారు. డిగ్రీ రెండో సంవత్సరంలో రూ.21,505, మూడో సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.13,835 విద్యా, వసతి దీవెన ద్వారా విడుదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఇస్తున్న అధిక ప్రాధాన్యత వల్ల నాలాంటి ఎంతో మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు మేలు జరుగుతోంది.  – లక్ష్మీప్రవల్లిక, డిగ్రీ ఫైనలియర్, సాధన డిగ్రీ కళాశాల, నంద్యాల  

పెరిగిన జీవనాధారం 
గొర్రెలను కాస్తున్న ఈమె పేరు కరణం పార్వతి. పత్తికొండ మండలం జూటూరు గ్రామానికి చెందిన ఈమె సంజువాణి పొదుపు గ్రూప్‌ సభ్యురాలు. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా గ్రూపులోని సభ్యులు గొర్రెలను కొనుగోలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో  పల్లెల్లోని తమ లాంటి పేద మహిళలు ఒకరిపై ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నారని పార్వతి తెలిపారు. తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూనే మరోవైపు గొర్రెల పెంపకాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.  

నాడు కూలీ.. నేడు వ్యాపారి  
చీరలు అమ్ముతున్న ఈమె పేరు ఫక్కుర్‌బీ. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామవాసి. గతంలో కూలి పనులకు వెళ్లేవారు. భర్త ఆటో నడిపేవారు. కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరి ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చింది. సున్నా వడ్డీ పథకం ద్వారా ఒకసారి రూ.50 వేలు, మరోసారి రూ.లక్ష రుణం తీసుకొని ఈమె గ్రామంలోనే రెడీమేడ్‌ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. రోజుకు రూ.4 వేల వరకు వ్యాపారం జరుగుతోంది. రూ.500 వరకు ఆదాయం వస్తున్నట్లు ఈమె తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా తన కూతురికి ఒకసారి రూ.15 వేలు, మరో సారి రూ.14 వేలు వచ్చినట్లు ఆమె చెప్పారు.  

అల్లికలకు చేయూత  
గంప అల్లుతున్న ఈమె పేరు పి.చంద్రమ్మ. తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ వాసి. ఈమెకు వైఎస్సార్‌ చేయూత ద్వారా ప్రభుత్వం రూ.18,750లను అందించింది.  ఈమె కులానికి చెందిన మరికొంత మందితో కలిసి ఒక ఈత చెట్ల వంకను లీజ్‌కు తీసుకున్నారు.  ఆ వంకలో నుంచి ఈత ఆకు కోసుకువచ్చి గంపలు, చీపుర్లు తయారు చేస్తున్నారు. వీటిని గుత్తి, పత్తికొండ తదితర ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్ముకుంటూ వచ్చిన దాంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చేయూత పథకం తమలాంటి పేదలకు ఎంతో ఉపయోగపడుతోందని చంద్రమ్మ తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: ఆరుగురితో విద్యుత్‌ ‘కోర్‌ కమిటీ’

మరిన్ని వార్తలు