రూయా చిన్న పిల్లల ఆసుపత్రి.. భేష్‌, ఎన్‌సీపీసీఆర్ సభ్యుడి ప్రశంస

25 Mar, 2023 19:31 IST|Sakshi

సాక్షి, తిరుపతి: రూయా చిన్నపిల్లల ఆసుపత్రిని జాతీయ బాలల హక్కుల కమిషన్(NCPCR) సభ్యులు డాక్టర్ ఆర్.జి ఆనంద్ ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. అక్కడి సేవలు, సిబ్బంది పని తీరుపై అభినందనలు గుప్పించారు. శనివారం సాయంత్రం స్థానిక రుయా ఆస్పత్రిలోని చిన్న పిల్లల విభాగంలోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్  వార్డును ఆకస్మిక తనిఖీ చేశారు ఆర్‌జీ ఆనంద్‌. అక్కడ చికిత్స పొందుతున్న పిల్లలకు అందుతున్న సేవలను వారి తల్లులను, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారాయన. 

ఈ సందర్భంగా.. అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన చికిత్స విధానం, అక్కడి పరికరాలను ఆయన పరిశీలించారు. అనంతరం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ఏర్పాటు చేసిన వార్డులలో చికిత్స పొందుతున్న పోషకాహార లోపం గల పిల్లలు,  ఎదుగుదల లేని పిల్లలకు అందిస్తున్న చికిత్స విభాగాన్ని.. సంబంధిత విభాగపు హెచ్‌వోడి డా. తిరుపతి రెడ్డితో కలిసి పరిశీలించారు. అందులో రోజు వారీగా అందిస్తున్న మెనూ చార్టు, కిచెన్ పరిశీలించి అందులో పిల్లలకు అందిస్తున్న ఎన్ఆర్‌సీ లడ్డు ను రుచి చూసి చాలా నాణ్యత గల పౌష్టికాహారం అందిస్తున్నందుకు అధికారులను అభినందించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం, విద్యా, బాలల శ్రేయస్సు కు కట్టుబడి ఉన్నాయని అన్నారు. ఆసుపత్రి విభాగాలలో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు చేపడుతున్నందుకు వారికి వారి సిబ్బందిని అభినందించారు. పిల్లలకు కౌన్సెలింగ్ రూము, ఆట పాటలకు ఎన్ఆర్సి విభాగంలో ఏర్పాటు బాగుందని అన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీఎం జగన్‌.. ఇద్దరూ వైద్య ఆరోగ్యానికి, ఆసుపత్రుల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన కు బాలల శ్రేయస్సు కు పెద్ద పీట వేస్తున్నారని, ఇది శుభ పరిణామం అని పేర్కొన్నారాయన. ఆసుపత్రికి సంబంధించిన బాలలకు ఉపయోగపడే మెరుగైన విధానాల అమలుకు ఏమైనా సహకారం కావాలంటే అందిస్తామని తెలిపారు. ఆసుపత్రి పనితీరు, పరిసరాల పరిశుభ్రత, వైద్య సదుపాయాలు చాలా బాగా ఉన్నాయని కితాబిచ్చారు. తొందరలోనే పూర్తి స్థాయి సభ్యులతో వచ్చి సందర్శిస్తామని తెలిపారు.

తనిఖీ సందర్భంగా ఆయన వెంట రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగ మునీంద్రుడు, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ పార్థ సారథి రెడ్డి, సి ఎస్ ఆర్ ఎంఓ లక్ష్మా నాయక్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య, పి ఆర్ ఓ కిరణ్ ఇతర వైద్యాధికారులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు