19న ఎన్‌డీబీ రెండో విడత రీ టెండర్లు

13 Oct, 2020 03:54 IST|Sakshi

రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో రూ.792.76 కోట్లతో పనులు

మొదటి విడతలో నాలుగు జిల్లాల్లో ఈ నెల 14న టెండర్లు

సాక్షి, అమరావతి: న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) సాయంతో రాష్ట్రంలో రహదార్లు, వంతెనల పునర్నిర్మాణ పనులకు సంబంధించి రెండో విడత రీ టెండర్ల ప్రకటనను ఈ నెల 19న జారీచేయనున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో రూ.792.76 కోట్ల పనులకు రీ టెండర్‌ ప్రకటన ఇవ్వనున్నారు. తొలివిడత రీ టెండర్లకు విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రూ.682.16 కోట్ల పనులకు ఈ నెల 14న నోటిఫికేషన్‌ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

ఈ టెండర్లలో రెండు నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం రూ.6,400 కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి మొదటి విడతగా రూ.1,860 కోట్లతో 13 ప్యాకేజీలకు గతంలో ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి. సీఎం వైఎస్‌ జగన్‌ ఆర్‌అండ్‌బీ ముఖ్య అధికారులతో సమీక్షించి కాంట్రాక్టర్లలో పోటీతత్వం పెంచేందుకు టెండర్లను రద్దుచేసి మళ్లీ పిలవాలని ఆదేశించడంతో ఎన్‌డీబీ టెండర్లను రద్దుచేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు