వరద బాధితులను రక్షిస్తూ.. ఆశల దీపం ఆరిపోయింది

21 Nov, 2021 08:00 IST|Sakshi

వరద బాధితులను రక్షించే క్రమంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి  

కందిశ గ్రామంలో విషాదఛాయలు

సాక్షి,రేగిడి(శ్రీకాకుళం): ఆశల దీపం ఆరిపోయింది. ఆదుకుంటాడనుకున్న కొడుకు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. కుమారుడి జ్ఞాపకాలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు, గ్రామస్తులు కన్నీరు పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధి కందిశ గ్రామానికి చెందిన కెల్ల శ్రీనివాసరావు (30) విజయనగరం ఐదో బెటాలియన్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా ఏడేళ్లుగా పని చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో సంభవించిన వరదల్లో పలువురు చిక్కుకున్నారు. దీంతో విధి నిర్వహణ కోసం అక్కడకు వెళ్లిన శ్రీనివాసరావు బాధితులను కాపాడే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు వరద నీటిలో మునిగి శనివారం ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారం తెలియడంతో కందిశ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.  

గుండెలవిసేలా.. 
శ్రీనివాసరావు తల్లిదండ్రులు వరహాలనాయుడు, గౌరీశ్వరిలు వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. వీరికి కుమారుడు శ్రీనివాసరావుతోపాటు కుమార్తె ధనలక్ష్మి ఉన్నారు. శ్రీనివాసరావుకు వివాహమై ఏడాదిన్నర కుమారుడు మోక్షజ్ఞంనాయుడు ఉన్నాడు. భర్త మృతి విషయం తెలుసుకొని  భార్య సునీతతోపాటు కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. మృతదేహం కోసం గ్రామస్తులంతా ఎదురు చూస్తున్నారు. 

పలువురు సంతాపం  
శ్రీనివాసరావు మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.  రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ అభ్యర్థి పాలవలస విక్రాంత్, ఎంపీపీ దార అప్పలనరసమ్మ, వైస్‌ ఎంపీపీ టంకాల అచ్చెన్నాయుడు, రేగడి మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ వావిలపల్లి జగన్మోహనరావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గేదెల వెంకటేశ్వరరావు, రాష్ట్ర సోషల్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ వంజరాపు భారతీ అశోక్‌కుమార్, సర్పంచ్‌ కెల్ల పద్మావతి, ఎంపీటీసీ సభ్యురాలు కెల్ల చిన్నమ్మడు, కెల్ల మన్మథరావు సంతాపం తెలియజేసిన వారిలో ఉన్నారు. 

మరిన్ని వార్తలు