కరోనా కాటుకు 6,890 మంది బలి

19 Nov, 2020 03:07 IST|Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌తో ఢిల్లీలో ఆందోళనకర పరిస్థితులు 

చలికాలంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది

నియంత్రణలో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో తీరు.. ఇతర రాష్ట్రాల ఎన్నికలతో పోల్చవద్దు 

అనువైన పరిస్థితులు ఏర్పడిన వెంటనే సమాచారమిస్తాం 

ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలి 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డకు సీఎస్‌ సాహ్ని ప్రత్యుత్తరం  

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే 6,890 మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించి వైరస్‌ మరింత వ్యాప్తి చెందే పరిస్థితికి అవకాశం ఇవ్వడం ఏమాత్రం మంచిది కాదంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ప్రత్యుత్తరమిచ్చారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అందుకు సంబంధించి జిల్లాల కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహణకు ఏర్పాటు చేయాలంటూ మంగళవారం సీఎస్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన సీఎస్‌ నీలం సాహ్ని అదే రోజు ప్రత్యుత్తరమిస్తూ కరోనా రెండో దశ వ్యాప్తితో ఢిల్లీలో ఆందోళన నెలకొన్న పరిస్థితులతో పాటు చలి కాలంలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా రాష్ట్రాలు వాటి పరిధిలో పట్టిష్ట చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించడాన్ని ప్రస్తావిస్తూ, ఇలాంటి తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడాన్ని ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు కారణంగా ఎస్‌ఈసీ చూపడంపై స్పందిస్తూ.. కరోనా నియంత్రణకు రాష్ట్రాలు వేర్వేరు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయని, అన్ని రాష్ట్రాలలోనూ కరోనా పరిస్థితులు ఒకే విధంగా లేవని సీఎస్‌ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కరోనా నియంత్రణలో కేంద్రం సూచనలు, సలహాలు మేరకు పని చేస్తున్నట్టు సీఎస్‌ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అనువైన పరిస్థితులు నెలకొన్న వెంటనే ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అన్ని విధాల సహకరించేందుకు సన్నద్ధంగా ఉంటామన్నారు. ఈమేరకు సీఎస్‌కు రాసిన లేఖను బుధవారం ఆమె విడుదల చేశారు. 

విరమించుకోండి...
యాక్టివ్‌ కరోనా కేసులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయని, అధికార యంత్రాంగమంతా నియంత్రణ చర్యల్లో నిమగ్నమైందని సీఎస్‌ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఫలానా సమయంలో ఎన్నికలు నిర్వహించాలని ముందే స్పష్టమైన నిర్ణయానికి రావడం సముచితం కాదని సీఎస్‌ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, ఎన్నికల నిర్వహణకు సంబంధించి సమీక్షలు లాంటివి ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం లేదని సూచించారు. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు పూర్తి సన్నద్ధంగా ఉంటుందన్నారు.  కలెక్టర్లతో నిర్వహించ తలపెట్టిన వీడియో కాన్పరెన్స్‌ సమావేశం అవసరమని భావించడం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు రాసిన లేఖలో సీఎస్‌ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు