ఇంధన ఆదా బిల్డింగ్‌లకు ‘నీర్మాణ్‌’ అవార్డులు

9 Aug, 2021 07:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఇంధన పొదుపు నిబంధనలను పాటిస్తూ నిర్మించిన కట్టడాలకు కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ రోడ్‌ మ్యాప్‌ ఫర్‌ మూమెంట్‌ టువర్డ్స్‌ అఫర్డబుల్‌ అండ్‌ నేచురల్‌ హేబిటేట్‌ (ఎన్‌ఈఈఆర్‌ఎంఏఎన్‌–నీర్మాణ్‌)’ పేరిట అవార్డులతో ప్రోత్సహించనుంది. మొత్తం ఎనిమిది విభాగాల్లో అందిస్తున్న అవార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 31 చివరి తేదీ అని ఇంధన శాఖ ఆదివారం ప్రకటనలో పేర్కొంది.

రాష్ట్రం నుంచి అత్యధిక మంది అవార్డులకు దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మికి ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి లేఖ రాశారు. రాష్ట్రంలో వాణిజ్య భవనాల్లో 5,130 మిలియన్‌ యూనిట్లకు డిమాండ్‌ ఉండగా ఈసీబీసీ–2017 నిబంధనలను అమలు చేయడం ద్వారా 1,542 యూనిట్ల విద్యుత్‌ అంటే 25 శాతం పొదుపు చేయవచ్చని అంచనా వేశారు. దీనివల్ల రూ.881 కోట్ల విలువైన విద్యుత్‌ను ఆదా చేయగలుగుతారు. గృహ వినియోగంలో ఈ నిబంధనలు పాటించడం ద్వారా 3,410 మిలియన్‌ యూనిట్ల వరకు ఆదా చేయవచ్చని ఇంధన శాఖ అధికారులు అంచనా వేశారు.  

మరిన్ని వార్తలు