ప్రశాంతంగా ముగిసిన నీట్‌

14 Sep, 2020 04:35 IST|Sakshi
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం దాసరిపాళెం లోని ఆర్‌వీఆర్‌జేసీ కళాశాలలో నీట్‌ పరీక్ష రాసేందుకు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ వాటర్‌ బాటిళ్లతో హాజరైన విద్యార్థులు

కోవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య పరీక్ష 

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల కోసం ఆదివారం జరిగిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అభ్యర్థులు మాస్కులు, గ్లౌజులు ధరించి పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులను మూడు స్లాట్లుగా పరీక్ష కేంద్రంలోకి అనుమతించడంతో ఉదయం 11 గంటలకే కేంద్రాలకు వచ్చినవారు మూడు గంటల పాటు వేచిఉండాల్సి వచ్చింది. ఉష్ణోగ్రతలు ఆదివారం తగ్గి వాతావరణం చల్లబడటంతో అభ్యర్థులు కాస్త ఉపశమనం పొందారు. పరీక్ష కేంద్రానికి వచ్చిన అభ్యర్థులను థర్మల్‌ స్క్రీనింగ్‌తో పాటు ఇతర సెక్యూరిటీ పరికరాలతో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతించారు.  

ప్రశ్నపత్రంపై మిశ్రమ స్పందన 
పరీక్ష రాసిన అభ్యర్థుల ప్రశ్న పత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పేపరు కొంచెం సరళంగా వచ్చిందని కొంతమంది, ఫిజిక్స్‌ కష్టంగా ఉందని మరికొందరు, బయాలజీ, కెమిస్ట్రీ పేపర్లు సులభంగా ఉన్నాయని ఇంకొందరు చెప్పారు. గతేడాది కంటే ఈ ఏడాది కటాఫ్‌ మార్కులు పెరిగే అవకాశం ఉన్నట్టు అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. గత ఏడాది 518 మార్కులకు ఓసీకి సీటు వచ్చింది. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ వస్తేనే సీటు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 61 వేల మందికిపైగా అభ్యర్థులు పరీక్ష రాశారు.  
 

మరిన్ని వార్తలు