-

నిలువెత్తు నిర్లక్ష్యం

11 Aug, 2020 03:50 IST|Sakshi
రమేశ్‌ హాస్పిటల్‌లోని సిబ్బంది, కోవిడ్‌ పేషెంట్ల డేటా వివరాలను అడిగి తెలుసుకుంటున్న అధికారులు

కనీస భద్రతా చర్యలు శూన్యం

స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో అడుగడుగునా ఉల్లంఘనలే

3 ప్రత్యేక బృందాలతో రమేశ్‌ ఆస్పత్రుల్లో అధికారుల తనిఖీ

కీలక పత్రాలు, హార్డ్‌ డిస్క్‌లు, రోగుల రికార్డులు స్వాధీనం

నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మంది రోగులు

రూ.లక్షల్లో ఫీజులు వసూలు 

రమేశ్‌ హాస్పిటల్స్‌ సీవోవో, ఆస్పత్రి జీఎం, కో–ఆర్డినేటింగ్‌ మేనేజర్‌ల అరెస్టు

సాక్షి, అమరావతి బ్యూరో/గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌)/పటమట (విజయవాడ తూర్పు): విజయవాడ రమేశ్‌ ఆస్పత్రి.. హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న ప్రైవేటు కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి కారణం యాజమాన్యం నిర్లక్ష్యం, కనీస భద్రతా చర్యలు లేకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. సోమవారం అధికారులు, పోలీసులతో కూడిన మూడు ప్రత్యేక బృందాలు స్వర్ణ ప్యాలెస్‌తో సహా రమేశ్‌ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించాయి. నగరపాలక సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. భవన నిర్మాణం జరగకపోవడం, అధికంగా పేషెంట్లను చేర్చుకోవడం, రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేయడం, తదితర లోపాలను తనిఖీ బృందాలు గుర్తించాయి. రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యం ప్రమాదానికి కారణమని నిర్ధారిస్తూ ఆస్పత్రి చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీవోవో) డాక్టర్‌ కొడాలి రాజగోపాలరావు, స్వర్ణ ప్యాలెస్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఇన్‌చార్జి, ఆస్పత్రి జీఎం డాక్టర్‌ కె.సుదర్శన్‌తోపాటు కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ కోఆర్డినేటింగ్‌ మేనేజర్‌ పల్లెపోతు వెంకటేశ్‌లను విజయవాడ గవర్నర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు.  
 
ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా..  
– ఐదు కోవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుకు ఆస్పత్రి యాజమాన్యం అనుమతి కోరగా రెండు సెంటర్లకు మాత్రమే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అనుమతిచ్చారు.  
– కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చుతున్నందున అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంగా సూచనలు చేశారు. కానీ ఆస్పత్రి యాజమాన్యం వాటిని విస్మరించింది.  
– కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో శానిటైజర్లు ఇష్టానుసారం ఎక్కడపడితే అక్కడ నిర్లక్ష్యంగా వదిలేయడంతో మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమైందని తనిఖీ బృందాలు గుర్తించాయి.  
 
స్వర్ణ ప్యాలెస్‌లో లోపాలెన్నో...  
– ఏలూరు రోడ్డులో 1984లో ఎస్‌వీ (శ్రీ వెంకటేశ్వర) ఎస్టేట్స్‌ పేరుతో భవన నిర్మాణానికి యాజమాన్యం విజయవాడ నగరపాలక సంస్థకు దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు.. భవన నిర్మాణ మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని నాటి కార్పొరేషన్‌æ కమిషనర్‌ తిరస్కరించారు. అదనపు అంతస్తుల నిర్మాణం, పార్కింగ్, సెల్లార్‌ వంటి విభాగాల్లో పూర్తిగా డీవియేషన్లు ఉన్నాయని ప్లాన్‌ అనుమతిని పెండింగ్‌లో పెట్టారు. 1989లో అనుమతి లభించింది. 
– రెసిడెన్షియల్‌ భవనానికి అనుమతులు పొందిన స్వర్ణ ప్యాలెస్‌.. హోటల్‌ కేటగిరిలో వ్యాపారం నిర్వహిస్తోంది.  
– ఇలాంటివి నిర్వహించేటప్పుడు ప్రమాదం సంభవిస్తే తప్పించుకుని బయటకు వెళ్లేందుకు రెండు మార్గాలు ఉండాలి. కానీ ఒక మార్గమే ఉంది.  
– ఎమర్జెన్సీ లైట్లు కూడా లేవు. 
– అగ్నిప్రమాదాలు సంభవిస్తే ఆర్పేందుకు ఏర్పాట్లూ, డేంజరస్‌ అండ్‌ అఫెన్సివ్‌ ట్రేడ్‌ లైసెన్స్, తదితరాలు కూడా లేవు.  
– నాలుగు అంతస్తుల నిర్మాణానికి అనుమతి ఉండగా ఐదు అంతస్తులు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు.  
 
ప్రత్యేక బృందాల తనిఖీలతో..  
– విజయవాడలో రమేశ్‌ ఆస్పత్రికి చెందిన సిద్ధార్థ నగర్, లబ్బీపేట బ్రాంచ్‌ ఆసుపత్రులు, ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న స్వర్ణ హైట్స్, స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో నిర్వహిస్తున్న కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో సోమవారం జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్, ఏసీపీ సూర్యచంద్రరావు నేతృత్వంలోని మూడు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి.  
– తనిఖీల్లో పలు కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు, పేషెంట్ల రికార్డులు స్వాధీనం చేసుకున్నాయి. కోవిడ్‌ పేషెంట్ల వివరాలు, వారికి అందిస్తున్న వైద్యం, అందుకు వసూలు చేస్తున్న ఫీజులు తదితరాలపై ఆరా తీశాయి.  
– ఈ తనిఖీల్లో ఆస్పత్రి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మంది పేషెంట్లను చేర్చుకొని వారి నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నట్లు తేలింది.  
– స్వర్ణ ప్యాలెస్‌ యజమాని ముత్తవరపు శ్రీనివాసబాబు ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.  
– స్వర్ణ ప్యాలెస్‌లో అగ్ని ప్రమాద స్థలాన్ని జేసీ శివశంకర్‌ నేతృత్వంలోని బృందం పరిశీలించింది. ముఖ్యంగా హోటల్‌లో సంరక్షణ చర్యలు ఉన్నాయా? కోవిడ్‌ నిబంధనలు పాటించారా? ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి? అనే అంశాలపై విచారణ జరిపి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.  

మరిన్ని వార్తలు