కొలిక్కిరాని ఆర్టీసీ చర్చలు

25 Aug, 2020 04:21 IST|Sakshi

ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులపై కొనసాగుతున్న ప్రతిష్టంభన

సాక్షి, అమరావతి: ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసుల పునరుద్ధరణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. సోమవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఇరురాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ ఏడాది జూన్‌ 18న టీఎస్‌ఆర్టీసీ అధికారులు విజయవాడకు వచ్చి చర్చలు జరిపిన సందర్భంలో కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సుల్ని నడపాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

తాజాగా ఏపీఎస్‌ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌లో భేటీకి హాజరైన అధికారులు తెలంగాణకు నడిపే సర్వీసులు, కి.మీ.ల ప్రతిపాదనను టీఎస్‌ఆర్టీసీ అధికారులకు అందించారు. అయితే టీఎస్‌ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులను, లేదా కి.మీ.లను తగ్గించుకోవాలని ఏపీకి సూచించారు. ఈ సూచన ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని, తర్వాత నిర్ణయం చెబుతామని ఏపీ అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణకు ఏపీఎస్‌ఆర్టీసీ రోజూ 2.65 లక్షల కి.మీ. బస్సులు నడిపేందుకు ప్రతిపాదనలు అందించింది. అయితే టీఎస్‌ఆర్టీసీ ఏపీకి 1.16 లక్షల కి.మీ. బస్సు సర్వీసులు నడుపుతోంది. ఈ మేరకే ఏపీఎస్‌ఆర్టీసీ కూడా తగ్గించాలని సూచించింది. 

మరిన్ని వార్తలు