కొలిక్కి వచ్చిన బ్రహ్మంగారి మఠం వివాదం, పీఠాధిపతి ఆయనే

25 Jun, 2021 20:51 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: కాలజ్ఞాని పోతులూరి శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠం వివాదం కొలిక్కి వచ్చింది. రెండు కుటుంబాల మధ్య రాజీ చర్చలు ఫలించాయి. 12వ మఠాధిపతిగా వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాముల మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామికి అవకాశం దక్కింది. ఉత్తరాధికారిగా మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రయ్య బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

తదనంతరం మఠాధిపతిగా రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ కుమారుడికి అవకాశం రానుంది. మైదుకూరు ఎమ్మెల్యే రఘురాంరెడ్డి సారథ్యంలో, కందిమల్లయ్యపల్లి సంస్థానం పుర ప్రజల సహకారంతో పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. పరస్పర అంగీకారంతో రెండు కుటుంబాల మధ్య కుదిరిన సయోధ్య కుదిరింది. రేపు ఇరు కుటుంబాలు మీడియా ముందుకు రానున్నట్టు సమాచారం.

11వ మఠాధిపతి కుటుంబ వివరాలు...
శివైక్యం చెందిన 11వ మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాముల వారికి ఇరువురు భార్యలు.పెద్ద భార్య చంద్రావతమ్మకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె కాగా.. పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి మఠాధిపత్యం కోరుకుంటున్నారు. ఆయన న్యాయ విద్య పూర్తి చేశారు. మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రయ్య. పెద్ద భార్య చంద్రావతమ్మ మరణంతో వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాములు 63 సంవత్సరాల వయసులో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన 24 ఏళ్ల వయసున్న మారుతి మహాలక్షమ్మను వివాహమాడారు. వివాహానంతరం ఆమెకు ఇద్దరు కుమారులు జన్మించారు. వీరిద్దరూ మైనర్లు.
(చదవండి: ఆధిపత్యంపై ‘పీఠ’ముడి!)

మరిన్ని వార్తలు