మూగప్రేమకు అమ్మానాన్న.. 50 ఏళ్లకుపైగా సేవలు

6 Dec, 2021 10:42 IST|Sakshi

‘మానవసేవే మాధవసేవ’గా భావిస్తారు. ఈ దంపతులు మాత్రం అంతకుమించి జంతుసేవలో జీవిత పరమార్థాన్ని తెలుసుకున్నారు. ‘ఆకలి’ అన్ని ప్రాణులకు సమానమే. మనిషికి ఆకలైతే నోరు తెరిచి అర్ధించి కడుపు నింపుకుంటారు. జంతువులు ఆకలైయినా నోరు తెరిచి అడగలేవు. తాము తినేప్పుడు ఎదుటకు వచ్చిన మూగజీవుల ఆకలి బాధను వారు గ్రహించారు. ఆరోజు నుంచి క్రమం తప్పకుండా రెండుపూట్ల వాటి ఆకలి తీర్చడం దినచర్యగా పెట్టుకున్నారు. అన్నం, కూరలు వండి మూగజీవులుండే ప్రాంతాలకు వెళ్లి ప్రేమతో ఆహారాన్ని అందిస్తూ అమ్మానాన్నలయ్యారు.   

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు నగరంలోని దర్గామిట్ట పోలీస్‌కాలనీలో ఎం.విజయ్‌కుమార్, రాజ్యలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వారుండేది మానవ ప్రపంచంలో అయినా మనస్సు మాత్రం జంతు ప్రపంచంతో ముడిపడి ఉంది. విజయ్‌కుమార్‌ కేబుల్‌ ఆపరేటర్‌. వేకువజాము నుంచి కుక్కలు, కోతులు, పిల్లులు, ఆవులు, పక్షుల ఆకలి తీర్చడంతో ఈ దంపతుల దినచర్య ప్రారంభమవుతోంది. ఆ సమయానికి మూగప్రాణులు వారి కోసం ఎదురు చూస్తుంటాయన్న ఆత్రుత వారిలో కనపడుతుంటుంది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద నుంచి అయ్యప్పగుడి సెంటర్‌ వరకు ఉన్న వీధుల్లోని మూగజీవాలకు అతను సుపరిచితుడు.

ఉదయాన్నే పాలు, బిస్కెట్లు దగ్గర నుంచి భోజనం వరకు అందిస్తుంటాడు. అనారోగ్యం పాలై ఇబ్బందులు పడే వాటికి వైద్యసేవలు సైతం అందిస్తుంటాడు. తాను తినే ముద్దలో మూగజీవాల ఆకలి తీర్చాలనే సంకల్పాన్ని తండ్రి ఆనందరావు దగ్గర నుంచి విజయ్‌కుమార్‌ పుణికి పుచ్చుకున్నాడు. దీనికితోడు భార్య రాజ్యలక్ష్మి సహకారం కూడా తోడవడంతో తన సేవా కార్యక్రమాలు మరింత బలపడ్డాయి. దీంతో సుమారు 50 ఏళ్లుగా మూగజీవాల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. 

స్వయంగా వెళ్లి..
ఉదయం ఐదు కేజీలు, సాయంత్రం ఐదు కేజీల బియ్యం, కూరలు, అప్పుడప్పుడు మాంసం, చేపలు కూరలు సైతం వండి ఆయా ప్రాంతాలకు స్వయంగా వెళ్లి మూగజీవాలకు పెడుతుంటాడు. వీధుల్లో చాలామంది ఆహార పదార్థాలను పడేస్తుంటారు. వాటిని తీసుకొచ్చి మూగజీవాలు తినేవిధంగా తయారు చేస్తారు. విజయ్‌కుమార్‌ దంపతుల సేవను గుర్తించిన స్నేహితులు, బంధువులు సైతం ఈ విషయంలో తోడుంటారు. 

వైద్యసేవలు
ఆకలి తీర్చడంతో పాటు జబ్బున పడిన మూగ జీవులకు వైద్యసేవలు అందించేందుకు డాక్టర్ల సహాయం తీసుకునేవాడు విజయ్‌కుమార్‌. ఓ రోజు రాత్రి సమయంలో రైలు పట్టాల మధ్యలో ఆవు చిక్కుకున్న విషయాన్ని గుర్తించి పశువైద్యాధికారులను, రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేసి ఆవును ప్రమాదం నుంచి తప్పించిన ఘటన తన జీవితంలో మర్చిపోలేనని చెప్తాడు. కరెంట్‌ షాక్‌కు గురైన కోతి కాలును బాగు చేయించేందుకు మూడు నెలలకు పైగా వైద్యసేవలు అందించానంటాడు. తాను చేస్తున్న పనులను చూసి ఆ వీధుల్లో వారు పాలు, పెరుగు ఇచ్చేవారు.

కరోనా సమయంలో..  
కరోనా సమయంలో మూగజీవాలు ఆకలికి అల్లాడాయి. ముఖ్యంగా కరెంటాఫీస్‌ సెంటర్‌ కోతులకు కేంద్రం. ఆ సమయంలో విజయ్‌కుమార్‌ కష్టపడి అరటి పండ్లను సేకరించి వాటి ఆకలి తీర్చాడు. ఇంటి వద్దకు వచ్చే ఆవులకు, పిల్లులకు సైతం ఆకలిని తీర్చడం కరోనా సమయంలో కష్టమైంది. అయినా తమ సేవా కార్యక్రమాలను ఆపలేదు. జంతువులపై తనకున్న జాలి, దయ, తన సంపాదనలో అధికంగా వెచ్చించేందుకు ఇష్టపడ్డాడు. ఇటీవల నెల్లూరులో భారీ వర్షాలు, వరదల సమయంలో సైతం మూగజీవాలకు ఆహారం పెట్టే కార్యక్రమాలకు బ్రేక్‌ వేయలేదు.    

మొదలైందిలా.. 
విజయ్‌కుమార్‌ తండ్రి ఆనందరావు ఆర్టీసీ ఏడీసీగా పని చేస్తుండేవారు. ఆ రోజుల్లో జంతువులకు బిస్కెట్లు, పాలు అందించేవాడు. తాను వి«ధులకు వెళ్లి వచ్చేప్పుడు విధిగా ఈ పనిని చేయడం తనకు అలవాటు. ఈ పని చిన్నప్పటి నంచి విజయ్‌కుమార్‌ చూస్తూ మూగజీవాలపై ప్రేమను పెంచుకున్నాడు. ఉద్యోగం నుంచి తండ్రి విశ్రాంతి పొందిన తర్వాత తండ్రీ కొడుకులిద్దరూ ఈ పనిని కొనసాగించారు. తమకున్నంతలో కూరగాయలు, పండ్లు, ఆకు కూరలతో పాటు అన్నం ఆయా ప్రాంతాల్లోని జంతువులకు పెట్టడం దిన చర్యగా చేసుకున్నారు.

ఎంతో ఆనందాన్నిస్తోంది 
తాను తినే ముద్దలోనే పశుపక్షాదుల ఆకలి గుర్తు చేసుకుంటాం. ఉన్నంతలోనే మా కుటుంబం మూగజీవాల కోసం సహాయం అందించడం తృప్తినిస్తుంది. వీధి కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్‌ ఆపరేషన్లు చేయించడం సామాజిక బాధ్యతగా భావిస్తాను. ఉదయాన్నే గోవులు, పక్షుల ఇంటి ముందు వాలడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉదయం, సాయంత్రం ఒక గంట కేటాయిస్తే మూగజీవాల ఆకలి తీర్చిన వాడినవుతాను. మనుషులకు పెడితే మర్చిపోతారేమో కానీ, మూగజీవాలు మాత్రం తమ ప్రేమను కళ్లల్లోనే చూపే విధానం ఒక మధురమైన అనుభూతి. మూగజీవాలకు ఎటువంటి సేవలు కావాలన్నా 97002 21223 నంబర్‌కు ఫోన్‌ చేస్తే నిస్వార్థంగా అందిస్తాను.  – విజయ్‌కుమార్‌ 

మరిన్ని వార్తలు