ఖాకీ వనం.. న్యాయాలయంగా మార్చిన పోలీస్‌ బాస్‌  

16 May, 2022 16:20 IST|Sakshi

ప్రతి సోమవారం స్పందనలో వివిధ సమస్యలపై ఫిర్యాదులు

న్యాయం కోసం వచ్చే బాధితులకు అన్ని విధాలుగా ఆదరణ

మానవతా దృక్పథంతో సమస్యలకు  పరిష్కారం

కౌన్సెలింగ్‌ ఇప్పిస్తూ న్యాయం చేస్తున్నపోలీసులు

మలి వయస్సులో బిడ్డలు ఆదరించలేదని.. జీవితాంతం తోడు నీడగా ఉండాల్సిన భర్తే హింసిస్తున్నాడని.. భర్త చనిపోతే మెట్టింటి వారు బయటకు నెట్టేశారని.. ఉబికి వస్తున్న కన్నీళ్లతో.. బరువెక్కిన గుండెలతో న్యాయం కోసం పోలీస్‌ స్పందనకు వచ్చే బాధితులకు జిల్లా పోలీస్‌ బాస్‌ బాసటగా నిలుస్తున్నారు. ఖాకీ వనాన్ని.. న్యాయాలయంగా మార్చారు. కుటుంబ సభ్యుల మధ్య భవబంధాలను, ఆప్యాయతా అనురాగాలను, కలిసి జీవించిన మధుర క్షణాలను గుర్తు చేస్తూ కౌన్సెలింగ్‌ ఇచ్చి వారిలో మార్పు తీసుకువస్తున్నారు. ఇతర ఫిర్యాదులపై పరిష్కరించ తగినవి అయితే అక్కడికక్కడే చర్యలు చేపడుతున్నారు. వ్యయప్రయాసలు పడి వచ్చే బాధితులకు ఆకలి తీరుస్తూ ఆదరిస్తూ.. పోలీసుల్లో కాఠిన్యమే కాదు.. కారుణ్యం ఉందని ఆర్తుల పాలిట ఆప్తుడయ్యాడు.  

సాక్షి, నెల్లూరు: జిల్లా పోలీస్‌ శాఖను కారుణ్య వనంగా మార్చేశారు. ఇటు ప్రజల సమస్యలతో పాటు సిబ్బంది సమస్యలు, సంక్షేమంపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్పందన’ కార్యక్రమ స్వరూపాన్ని పోలీస్‌ బాస్‌ మార్చేశారు. ఎంతో వేదనతో.. కళ్లల్లో కన్నీళ్లు పెట్టుకుని న్యాయం కోసం వచ్చే బాధితులకు బాసటగా మార్చేశారు. కుటుంబ వివాదాలను మానవీయ కోణంలో ఆలోచించి వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి వారికి న్యాయం జరిగేలా చేస్తున్నారు.  

ఇలాంటి ఘటనలు మాత్రం దాదాపు 200 పైగా పరిష్కరిస్తుంచారు. ఆర్థిక నేరాలు, వేధింపులు సైబర్‌ నేరాలుపై మాత్రం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయిస్తున్నారు. ఈ తరహా 375 ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయించి వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే స్పందనలో ఇలాంటి వందల సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపించారు. గతేడాది జూలై నుంచి ఇప్పటి వరకు 2,811 వినతులు రాగా అందులో 90 మాత్రమే పెండింగ్‌లో ఉన్నవి. మిగిలిన ఫిర్యాదులను పరిష్కరించారు. 


   
కన్నీళ్లు తుడిచి.. ఆకలి తీర్చి.. న్యాయం చేసి..  
మానసికంగా వేదనకు గురై న్యాయం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలు పడి ఎస్పీ కార్యాలయానికి వచ్చే బాధితులకు పోలీస్‌ బాస్‌ విజయారావు ముందు వారి కన్నీళ్లు తుడుస్తున్నారు. ఆ తర్వాత ఆకలి తీరుస్తున్నారు. అప్పుడే వారి కష్టాన్ని తీర్చి న్యాయం చేసి పంపిస్తున్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితులు వారి సహాయకులకు మధ్యాహ్నం వేళ భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు.

గతంలో ఏ పోలీస్‌ బాస్‌ ఇలా చేయని విధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఎవరూ ఆకలితో వెళ్లకూడదని తన సొంత ఖర్చుతోనే వారికి భోజనం పెట్టేలా ఏర్పాటు చేశారు. గతంలో జిల్లా పోలీస్‌ కార్యాలయంలో న్యాయం జరుగుతుందని ఎంతో ఆశగా వచ్చిన కొందరు  బాధితులకు చేతిలో డబ్బులేక మధ్యాహ్నం సమయంలో ఆకలితోనే ఉండి వెళ్లిన పలు ఘటనలు ఎస్పీ దృష్టికి రావడంతో ఆయన  ఈ నిర్ణయం తీసుకున్నారు. వేసవి కాలంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి చల్లని మజ్జిగ బాధితులకు అందించారు.  

సిబ్బంది సంక్షేమంపై  ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న ఎస్పీ విజయారావు, తమ శాఖలోని ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించారు. సొంత శాఖలో పనిచేసే ఉద్యోగులు, అధికారుల్లో ఆత్మçస్థైర్యం నింపేందుకు సత్వర చర్యలు చేపట్టారు. పోస్టింగ్‌లు లేక వీర్‌ఆలో ఉన్న ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. అంతే కాదు ప్రతి శుక్రవారం సిబ్బంది కోసం ప్రత్యేక గ్రీవెన్స్‌డే నిర్వహించి వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ వారికి న్యాయం చేస్తున్నారు.

వింజమూరుకు చెందిన వై.వెంకటేశ్వర్లు (74)కు ముగ్గురు కుమారులు. బిడ్డల భవిష్యత్‌ కోసం ఉన్నత చదువులు చదివించాడు. పెద్ద కుమారుడు  హైదరాబాద్‌లో శాస్త్రవేత్త. రెండో కుమారుడు కూడా పీహెచ్‌డీ చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. మూడో కుమారుడు బీటెక్‌ పూర్తిచేసి విదేశాల్లో స్థిరపడ్డాడు. వారి బంగారు భవిష్యత్‌ కోసం ఆయన అష్టకష్టాలు పడి  విద్యావంతులుగా తీర్చిదిద్ది, వివాహాలు చేశాడు. అందరూ స్థిరపడ్డారు. కానీ వారికి తండ్రి భారమయ్యాడు. ఆదరించమని వెళ్తే∙హింసించి పంపారు. బతకడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో న్యాయం కోసం స్పందన మెట్లు ఎక్కాడు. స్పందించిన ఎస్పీ కలిగిరి సీఐ ద్వారా ఆయన న్యాయం జరిగేలా చేశారు.  

నెల్లూరునగరంలోకి ఖుద్దూస్‌నగర్‌కు చెందిన ఎస్‌కే సబనా, రవితేజ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 7 ఏళ్లు, 4 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. తొలుత అన్యోన్యంగా సాగిన ఆ కుటుంబంలో తర్వాత కలతలు రేగాయి. భర్త ఆమెను వేధించడం ప్రారంభించాడు. భరించలేని ఆమె స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ విజయారావు వెంటనే దిశ పోలీస్‌స్టేషన్‌కు అటాచ్‌ చేసి ఆమెకు న్యాయం చేయమని ఆదేశించారు. దిశ స్టేషన్‌లో వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో ప్రస్తుతం వారి కాపురం సజావుగా సాగుతుంది.    

కొండాపురం మండలానికి చెందిన వెంకటరమణమ్మ (21) భర్త చనిపోయాడు. ఆదరించాల్సిన ఆమె మెట్టింటి వారు నిర్దాక్షిణ్యంగా బయటకు గెట్టేశారు. భర్త ఆస్తిలో కూడా ఏమీ ఇవ్వమని తెగేసి చెప్పి పుట్టింటికి పంపారు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె స్పందనలో ఎస్పీ విజయారావు ఎదుట తన ఆవేదన వెలిబుచ్చుకుంది. స్పందించిన ఎస్పీ కలిగిరి సీఐ ద్వారా ఆమెకు న్యాయం జరిగేలా చేశారు.  

న్యాయం జరిగేలా చేయడం నా బాధ్యత 
ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో న్యాయం జరుగుతుందని జిల్లా నలుమూలల నుంచి నా దగ్గరకు వస్తున్నా రు. వారి సమస్యలు విని సత్వరమే వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలి. అక్కడ న్యాయం జరగలేదంటేనే నా వద్దకు రావాలి. జిల్లాలో మా పోలీస్‌ శాఖ సమర్థవంతంగా పని చేస్తుంది. ఎవరైనా నిర్భయంగా స్టేషన్‌కు వెళ్లి సమస్యలు చెప్పుకోవచ్చు. ప్రతి సోమవారం జిల్లా కార్యాలయానికి వచ్చే బాధితులకు భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాం.  
– విజయారావు, ఎస్పీ, నెల్లూరు 
 

మరిన్ని వార్తలు