కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి భారీ ఝలక్‌.. ఇక మునుపటిలా ఉండదన్న ఆదాల

7 Feb, 2023 13:16 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి భారీ ఝలక్ తగిలింది. నియోజకవర్గ కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అయిన ఆదాల ప్రభాకర్‌రెడ్డికి మద్ధతు ప్రకటించారు. కార్పొరేటర్లతో పాటు ఎక్స్‌అఫిషియో మెంబర్లు మంగళవారం పార్టీ ఇన్‌ఛార్జి కార్యాలయానికి చేరుకుని.. తమ మద్ధతు అదాలకే అని పేర్కొన్నారు. అంతేకాదు మరో ఆరుగురు కార్పొరేటర్లు సైతం ఆదాల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో.. 

కోటంరెడ్డి బలం ఇద్దరు కార్పొరేటర్లకు చేరుకున్నట్లయ్యింది. ఈ సందర్భంగా.. నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి నియమించటం శుభపరిణామని కార్పొరేటర్లు పేర్కొన్నారు. నెల్లూర్‌ రూరల్‌లో పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని, ఆదాల ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని కార్పొరేటర్లు ఈ సందర్భంగా ప్రతినబూనారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కీలక నేత ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ..

వైఎస్సార్సీపీ రూరల్ ఇన్‌ఛార్జిగా నియమితులైన ఆదాలకి ఘన స్వాగతం పలికాం. తాజా పరిణామంతో.. పార్టీకి రూరల్ లో తిరుగులేని ప్రజాబలం ఉందని మరోసారి సంకేతం వచ్చింది. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి కార్యకర్తలు కష్టపడి పనిచేస్తేనే శ్రీధర్ రెడ్డి గెలిచారు. గెలిచాక కష్టపడిన వారిని పక్కన పెట్టి పక్కపార్టీ వాళ్ళకి పదవులు ఇచ్చాడు. తన దగ్గర 12 సిమ్ లు ఉన్నాయని శ్రీధర్ రెడ్డి చెబుతున్నాడు. లిక్కర్, గంజాయి మాఫియా, హత్యలు చేసేవారు, అనైతిక కార్యక్రమాలు చేసే వారికే అన్ని సిమ్ లు ఉంటాయి . ఆదాలని ఇంచార్జ్ గా ప్రకటించగానే మంచి నిర్ణయం తీసుకున్నారని రూరల్ ప్రజలు సంతోషించారు. సర్పంచ్, ఎంపీపీ, ఎంపీటీసీలు అందరూ ఆదాల కి సంఘీభావం తెలుపుతున్నారు. కోటంరెడ్డి దగ్గర ఉన్న కొంతమంది కార్పొరేటర్లు కూడా ఆదాల వైపు వచ్చేస్తారు అని విజయ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

కార్పొరేటర్లకు పూర్తి స్వేచ్ఛ: ఆదాల ప్రభాకర్ రెడ్డి కామెంట్స్

కార్పొరేటర్లకు ఇకపై పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, ఎప్పుడైనా తనను కలవొచ్చని వైఎస్సార్సీపీ రూరల్ ఇన్‌ఛార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేటర్లు మద్ధతు ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షించం. మేము ఎవరినీ బతిమాలాడము. రౌడీయిజం.. బెదిరింపులు కనిపించవు. మీ పరిధిలో ఉన్న, మీ సమస్యలు అన్ని పరిష్కరించుకుందాం. మీకు ఎలాంటి భయం లేదు. అభివృద్ధి కోసం సీఎం తో చర్చించి నిధులు తీసుకొస్తా అని ఆదాల, కార్పొరేటర్లకు భరోసా ఇచ్చారు.
 

మరిన్ని వార్తలు