వైఎస్సార్‌కు భారతరత్న ఇవ్వాలి 

1 Sep, 2021 03:08 IST|Sakshi
మాట్లాడుతున్న విద్యార్థిని జీవీ కార్తీక

ప్రధాని మోదీకి లేఖ రాసిన నెల్లూరు చిన్నారి కార్తీక  

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి భారత రత్న ఇవ్వాలని నెల్లూరుకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని జీవీ కార్తీక ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది. మంగళవారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌కు భారత రత్న ఇవ్వాలని జూలై 8న ప్రధానికి లేఖ రాసినట్లు చెప్పారు. వైఎస్సార్‌ రాజకీయవేత్త గానే కాకుండా డాక్టర్‌గా ఆరోగ్యశ్రీ, 108, 104 ఫ్రీ అంబులెన్స్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టిన గొప్ప మహానుభావుడని కొనియాడింది. రైతులకు ఉచిత విద్యుత్‌ పథకం ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండుగ చేశారని పేర్కొంది.
(చదవండి: నేడు ఇడుపులపాయకు సీఎం వైఎస్‌ జగన్‌)

దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని పేదల అభ్యున్నతికి వైఎస్సార్‌  పాటుపడ్డారని తెలిపింది. అంత గొప్ప చరిత్ర కలిగిన వైఎస్సార్‌కు భారత రత్న ఇవ్వాలని తాను ప్రధానిని కోరానని తెలిపింది. వైఎస్సార్‌ జీవిత చరిత్రను ప్రైమరీ స్కూల్‌ సిలబస్‌లో ఒక పాఠ్యాంశంగా చేర్చాలని సీఎం వైఎస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేసింది. పేదల అభ్యున్నతికి ఆయన చేసిన సేవ భావితరాలకు తెలియాలంటే పాఠ్యాంశంగా చేర్చాలని కోరింది.  
(చదవండి: ఏపీ మరో రికార్డు..)

మరిన్ని వార్తలు