కనిగిరి రిజర్వాయర్‌ ఘటనపై మీడియా అత్యుత్సాహం

5 May, 2022 12:20 IST|Sakshi
రోదిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు

కాలువలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

దళితవాడలో అలుముకున్న విషాదం  

సంగం దళితకాలనీ కన్నీరుమున్నీరైంది. ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు చిన్నారులు కనిగిరి రిజర్వాయర్‌ ప్రధాన కాలువలో పడి మృత్యువాత పడ్డారు. అప్పటి వరకు కళ్లముందే ఉన్న ఆ చిన్నారులు అంతలోనే విగతజీవులు కావడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. తమ బిడ్డలను ఉన్నంతలో ఉన్నతంగా చదివించాలని తపన పడుతున్న ఆ తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చారు.

సాక్షి, నెల్లూరు: ఇద్దరు చిన్నారులను కనిగిరి రిజర్వాయర్‌ ప్రధాన కాలువ మింగేసింది. అప్పటి వరకు తమ కళ్లముందు తిరుగాడిన  శ్రీరామ్‌ (8), ఈశ్వర్‌ (10) చిన్నారులు విగతజీవులు కావడంతో దళితవాడ గొల్లుమంది. సంగం గ్రామం దళితవాడకు చెందిన దారా వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమార్తెల తర్వాత శ్రీరామ్‌ (8) జన్మించాడు. వెంకటేశ్వర్లు తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు శ్రీరామ్‌ను ఉన్నతంగా చదివించాలని బెంగళూరులో కాపురం ఉంటూ కూలి పనులకు వెళ్లేవాడు.

పని ఉండడంతో మంగళవారం వెంకటేశ్వర్లు, తన కుమారుడు శ్రీరామ్‌తో కలిసి స్వగ్రామం సంగం వచ్చారు. సంగం దళితవాడకు చెందిన గడ్డం ఆదినారాయణమ్మ ఒకగానొక్క కుమారుడు ఈశ్వర్‌. అయితే బుధవారం ఉదయం 11 గంటల సమయంలో శ్రీరామ్, ఈశ్వర్, మరో చిన్నారి యక్షిత బహిర్భూమికని సమీపంలోని కనిగిరి రిజర్వాయర్‌ ప్రధాన కాలువ వద్దకు వెళ్లారు. కాలకృత్యాలు తీర్చుకొని కాలువలోకి దిగిన శ్రీరామ్, ఈశ్వర్‌ నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరి మృతదేహాలు బయటకు తీయడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి.  

అప్పుడే అన్నంపెట్టి వచ్చా  
నా కుమారుడు ఈశ్వర్‌ బడికెళ్లి ఉంటే 11 గంటల సమయంలో వెళ్లి భోజనం పెట్టి వచ్చానని గంట వ్యవధిలోనే ఈ ఘోరం జరిగింది. ఒక్కగానొక్క మగబిడ్డను దేవుడు దూరం చేశాడంటూ కన్నీరుమున్నీరు అయింది.  
– ఆదినారాయణమ్మ, ఈశ్వర్‌ తల్లి 

తల్లికి ఏమని చెప్పను 
బెంగళూరు నుంచి నేను, నా కొడుకు మంగళవారం వచ్చాం. నా భార్య, కూతుర్లు బెంగళూరులోనే ఉన్నారు. ఈ వార్తను నా భార్యకు ఎలా చెప్పాలంటూ కన్నీరు పెట్టుకోవడంతో అందరిని కలిచివేసింది.  
– దారా వెంకటేశ్వర్లు, శ్రీరామ్‌ తండ్రి

మీడియా అత్యుత్సాహం..
ఇదిలా ఉండగా కనిగిరి రిజర్వాయర్‌ చిన్నారుల మృతి ఘటనపై మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. మృతి చెందిన ఈశ్వర్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లగా.. కొన ఊపిరితో ఉన్న శ్రీరాంను 108 లో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ శ్రీరాం మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

శ్రీరాం మృతదేహాన్ని తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్‌ను మాట్లాడగా.. ఆలస్యం కావటంతో బాలుడి తండ్రి కొడుకు మృతదేహాన్ని బైక్‌పైనే ఇంటికి తీసుకెళ్లాడు. అయితే మరో రుయా ఘటన అంటూ కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో తప్పుగా ప్రచురించాయి. దీనిపై స్పందించిన పోలీసులు మరో రుయా అంటూ వస్తున్న కథనాల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు