మోటార్‌బైక్‌పై దేశాన్ని చుట్టేస్తున్న నెల్లూరు యువకుడు

18 Jul, 2022 16:35 IST|Sakshi

సాక్షి, నెల్లూరు డెస్క్‌: రోజుకో కొత్త ప్రదేశం.. కొత్త మనుషులు, కొత్త ఆచార వ్యవహారాలు.. కొత్త రుచులు.. ఇలా జీవితాన్ని ఆస్వాదించడం అందరికీ సాధ్యం కాదు. చాలామంది బిజీ లైఫ్‌లో పడి ప్రపంచాన్ని మర్చిపోతుంటారు. కొందరు మాత్రం ప్రయాణాలు చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. నెల్లూరు నగరానికి చెందిన వెంకట కార్తీక్‌ తూపిలి ఏడాదిపాటు దేశాన్నే తన ఇల్లుగా చేసుకునేందుకు మోటార్‌బైక్‌పై ముందుకు కదిలాడు. ఇప్పటికే పలు రాష్ట్రాలు చుట్టేశాడు.
చదవండి: గోదావరి వరదలు.. ఏ హెచ్చరిక ఎప్పుడు జారీ చేస్తారు?

నెల్లూరులోని ఉస్మాన్‌సాహెబ్‌పేటలో మల్లికార్జునరావు, సుజాత దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. తండ్రిది అరటికాయల వ్యాపారం. తల్లి గృహిణి. కొడుకు కార్తీక్‌ 2013 సంవత్సరంలో బీటెక్‌ చేశాడు. సంవత్సరంపాటు సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నాడు. అయితే ఇది తన గమ్యం కాదని తెలుసుకుని తల్లిదండ్రులకు నచ్చజెప్పి సివిల్స్‌ ప్రయత్నాలకు స్వస్తి పలికాడు. కొంతకాలంపాటు ఆహా, తదితర చోట్ల వెబ్‌ సిరీస్‌లకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు.

కొత్త ప్రపంచంలోకి..
కార్తీక్‌కు మొదటి నుంచి ప్రకృతి, ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలకు వెళ్లి మనుషులతో మాట్లాడుతుంటాడు. ఫొటోలు తీసుకుని జ్ఞాపకాలుగా మార్చుకోవడం అలవాటు. తనను తాను కొత్తగా పరిచయం చేసుకునేందుకు ఇండియా మొత్తం చుట్టాలని 2021 చివర్లో నిర్ణయించుకున్నాడు. కొత్త ప్రదేశాలు చూడడం, మనుషులతో మమేకమవడం, మారుమూల పల్లెలకు వెళ్లి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?, వారి సంస్కృతి, సంప్రదాయాలేంటో తెలుసుకునేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ మోటార్‌బైక్‌పై యాత్రకు శ్రీకారం చుట్టాడు. 400 రోజులపాటు తన ప్రయాణం సాగేలా ప్రణాళిక వేసుకున్నాడు. మొత్తం 1,50,000 కిలోమీటర్లు తిరిగి లాంగెస్ట్‌ జర్నీ ఇన్‌ సింగిల్‌ కంట్రీ పేరుతో గిన్నీస్‌బుక్‌ రికార్డు సాధించాలని కార్తీక్‌కు ఉన్న మరో లక్ష్యం. అందుకోసం గిన్నీస్‌ రికార్డు సంస్థకు దరఖాస్తు చేశాడు.

రోజుకు 350కి పైగా కి.మీ.
కార్తీక్‌ తొలుత మన రాష్ట్రంలో ఐదురోజులపాటు వివిధ ప్రాంతాలు తిరిగి ఆ తర్వాత తమిళనాడుకి వెళ్లాడు. అలా పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, గోవా చుట్టి ప్రస్తుతం మహారాష్ట్రలో తిరుగుతున్నాడు. ఈనెల 17వ తేదీ నాటికి 41,200 కిలోమీటర్లు తిరిగాడు. రోజుకు 350 నుంచి 450 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాడు. తన పర్యటనలో భాగంగా అధికంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తాడు.

మొదట్లో భయమేసింది
కార్తీక్‌ దేశమంతా బైక్‌పై తిరుగుతానంటే మొదట్లో భయమేసింది. సంవత్సరానికి పైగా దూరంగా ఉండాలి. ఆలోచించుకోమని చెప్పాం. వాడికి పట్టుదల ఎక్కువ. జాగ్రత్తగా వెళ్తానన్నాడు. ప్రోత్సహించాం. రోజూ ఫోన్‌ చేసి మాట్లాడుతుంటాం.
– మల్లికార్జునరావు, సుజాత, కార్తీక్‌ పేరెంట్స్‌ 

కుటుంబసభ్యుల సహకారం 
మోటార్‌బైక్‌ యాత్రకు కార్తీక్‌ కుటుంబసభ్యులు ఎంతగానో సహరిస్తున్నారు. తండ్రి ఆర్థికంగా అండగా నిలిచారు. అమ్మ, చెల్లి, బావ, స్నేహితులు పెళ్లూరు హరీ‹Ù, సూర్యప్రకాష్‌, సందీప్‌ (ఇతను 25,000 కి.మీ సైకిల్‌ యాత్ర చేశాడు.) ప్రోత్సాహం ఎంతో ఉందని కార్తీక్‌ చెబుతున్నాడు.

ఏం చేస్తాడంటే..
ఉదయం లేచాక ఆరోజు ఎంత దూరం వెళ్లాలి?, చూడాల్సిన ప్రదేశాలేంటి?, ఎక్కడ ఆగాలి? తదితర వివరాలతో కూడిన షెడ్యూల్‌ను సిద్ధం చేసుకుంటాడు. దారి మధ్యలో గ్రామాల్లో ఆగుతాడు. స్కూళ్లు, ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ప్రజలను కలిసి మాట్లాడుతాడు. కొత్త ప్రదేశాలు చూస్తాడు. సాయంత్రం చీకటి పడే సమయానికి ప్రయాణాన్ని ముగిస్తాడు. ఎవరైనా గ్రామస్తులు, పట్టణవాసులు ఆశ్రయమిస్తే అక్కడుంటాడు.

లేకపోతే స్కూల్స్, గురుద్వారాలు, ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండి పక్కరోజు ఉదయం మరో ఊరికి ప్రయాణమవుతాడు. ఇవి అందుబాటులో లేనప్పుడు ట్రావెలర్స్‌ కోసం ఉన్న కౌచ్‌ సర్ఫింగ్‌ యాప్‌ను ఉపయోగించుకుంటాడు. అటవీ ప్రాంతాలకు సమీపంలో టెంట్‌ వేసుకున్న సందర్భాలున్నాయి. ప్రయాణం ముగిసిన తర్వాత ఆరోజు చూసిన విశేషాలు, తీసిన ఫొటోలు తదితరాలను ది ట్రావెలర్‌ కార్తీక్‌ అనే ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో పోస్ట్‌ చేస్తాడు. తిరిగిన రూట్, ఎన్ని కి.మీ ప్రయాణించింది తదితర వివరాలను గిన్నీస్‌బుక్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటాడు.

ఘన స్వాగతం చెబుతున్నారు
యాత్ర మొదలుపెట్టినప్పుడు ఎన్నో అనుమానాలున్నాయి. వెళ్తున్న కొద్దీ అవన్నీ నివృత్తి అయిపోయాయి. కులం, మతం, భాషతో సంబంధం లేకుండా వెళ్లిన ప్రతిచోట బాగా రిసీవ్‌ చేసుకుంటున్నారు. ప్రేమని పంచుతున్నారు. తమిళనాడులోని మల్లిపట్టినం హార్బర్‌లో టెంట్‌ వేసుకుని ఉన్నప్పుడు ప్రజలు వచ్చి ఊర్లోకి తీసుకెళ్లి ఆశ్రయమిచ్చారు. అక్కడి విశేషాలు చెప్పారు. మహారాష్ట్రలోని అహ్మద్‌పూర్‌కి వెళ్లినప్పుడు స్థానికులు ఘన స్వాగతం పలికారు. నన్ను చూసి  హైదరాబాద్‌కు చెందిన 70 ఏళ్ల వ్యక్తి  తాను బైక్‌పై ట్రావెలింగ్‌ చేస్తానన్నాడు. ప్రకృతి, ట్రావెలింగ్‌ జీవితాన్ని కొత్తగా చూపిస్తాయి. నా ప్రయాణంలో నేను ఎన్నో చూశాను. మా అమ్మా, నాన్న వల్లే ఈ యాత్ర సాగుతోంది. తల్లిదండ్రులు పిల్లలకు ఫ్రీడం ఇవ్వాలి. అప్పుడే వారు తమకు నచ్చిన రంగాల్లో రాణించగలరు.
 –  కార్తీక్‌  

మరిన్ని వార్తలు