సార్‌.. మా ఊరే లేదంటున్నారు

23 Aug, 2021 02:54 IST|Sakshi
ఆధార్‌ కార్డులు ఇప్పించాలని చేతులు జోడించి వేడుకుంటున్న ఆదివాసీ పిల్లలు

బర్త్‌ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు

మా తల్లిదండ్రులకు ఆధార్‌ లేదు.. మాకూ లేదు

మా చదువు కోసం ఆధార్‌ కార్డులు ఇప్పించండి  

చేతులు జోడించి ఆదివాసీ పిల్లలు వినతి

జి.మాడుగుల: తమకు ఆధార్‌ కార్డులు ఇప్పించాలని ఆదివాసీ గిరిజన బాలబాలికలు ఆదివారం వినూత్నంగా చేతులు జోడించి వేడుకున్నారు. విశాఖ జిల్లా జి.మాడుగుల–రావికమతం మండలాల సరిహద్దులో నేరేడుబంద అనే కుగ్రామం ఉంది. ఇక్కడ పాతికలోపు కుటుంబాలు ఉన్నాయి. మారుమూలన ఉండే ఈ గ్రామం ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాకపోవడంతో.. ఇక్కడ జన్మించిన 18 మంది పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు జారీ కాలేదు. వీరు ఆస్పత్రిలో కాకుండా ఇంటి వద్దనే జన్మించడం, ఆరోగ్య సిబ్బంది రికార్డుల్లో కూడా వీరి గురించి నమోదు కాకపోవడంతో వీరికి బర్త్‌ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. దీంతో ఆధార్‌ కార్డులు జారీ చేయడం సమస్యగా మారింది.

మండలంలో గడుతూరు పంచాయతీ కేంద్రానికి, రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కేంద్రానికి వెళ్లి జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే నేరేడుబంద గ్రామం తమ జాబితాలో లేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు కూడా ఆధార్‌ కార్డులు లేవు. దీంతో విద్యతోపాటు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘చేతులు జోడించి విన్నవించుకుంటున్నాం.. జిల్లా కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో చర్యలు చేపట్టి మాకు ఆధార్‌ కార్డులు ఇప్పించాలి’ అని గిరిజన పిల్లలు వేడుకున్నారు. 

మరిన్ని వార్తలు