కొండెక్కి వస్తారు.. ప్రాణాలు రక్షిస్తారు

28 Jul, 2021 09:10 IST|Sakshi

మారుమూల అటవీ ప్రాంతాలకు అధునాతన బైక్‌ అంబులెన్స్‌లు

ఏడు ఐటీడీఏల పరిధిలో 1,809 మారుమూల ప్రాంతాల గుర్తింపు

1,503 ప్రాంతాలకు బైక్‌ అంబులెన్స్‌ సేవలు

మరో 306 అత్యంత మారుమూల ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

‘డోలీ’ మరణాలకు చెక్‌ పెట్టేలా..

సాక్షి, అమరావతి: గోదావరి జిల్లా వై.రామవరం అటవీ ప్రాంతం. చుట్టూ అడవి.. ఎటుచూసినా ఎత్తయిన కొండలు.. నడిచేందుకు కూడా దారిలేని ప్రాంతమది.. అడవంతా జోరు వాన కురుస్తోంది. ఓ గిరిజనుడు తీవ్రమై న కడుపు నొప్పితో  గింగిరాలు తిరుగుతున్నాడు.   ఆ గూడెంలో ఒకటే అలజడి.  డోలీ కట్టి ఆస్పత్రికి మోసుకెళదామంటే సమయం మించిపోయేలా ఉంది. సమాచారం అందుకున్న గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. బురదమయమైన మార్గంలోనూ బైక్‌ (ఫీడర్‌) అంబులెన్స్‌పై ఓ వ్యక్తి కొండలు, గుట్టల మీదుగా మెరుపు వేగంతో ఆ గూడెం వైపు కదిలాడు. అదే బైక్‌ వెనుక అమర్చిన పడక కుర్చీలాంటి సీటుపై అతనిని కూర్చోబెట్టుకుని క్షేమంగా ఆస్పత్రికి తరలించాడు. సకాలంలో వైద్య సేవలు అందడంతో ఆ ప్రాణం నిలిచింది.                  

రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఎవరికి రోగమొచ్చినా.. గర్భిణులకు ప్రసవ సమయమైనా ఆస్పత్రికి చేరాలంటే కిలోమీటర్ల తరబడి డోలీ మోత తప్పదు. బలమైన కొయ్య (కర్ర)లకు దుప్పటి కట్టడం లేదా తట్ట, నులక మంచాలకు తాళ్లు కట్టి ఇద్దరు లేక నలుగురు చొప్పున కిలోమీటర్ల కొద్దీ మోసుకుపోవాల్సిన దుస్థితి. ఆ ప్రయాణంలో సమయం మించిపోయినా, పరిస్థితి చేయి దాటినా ప్రాణాలు కోల్పోవాల్సిందే. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 16,068 గిరిజన ఆవాసాలున్నాయి. వాటిలో 1,809 ప్రాంతాలకు దారి కూడా లేకపోవడంతో పాత ఫీడర్‌ అంబులెన్స్‌లు సైతం అక్కడకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. ఇకపై డోలీ మరణాలు సంభవించకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా కార్యాచరణ చేపట్టింది. అధునాతన బైక్‌ అంబులెన్స్‌లను రంగంలోకి దించుతోంది.

ఎక్కడికైనా సునాయాసంగా వెళ్లేలా.. 
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే 122 ఫీడర్‌ (బైక్‌) అంబులెన్స్‌లు, 79 ప్రత్యేక అంబులెన్స్‌లు సేవలందిస్తున్నాయి. వీటికి పక్కన రోగిని పడుకోబెట్టి తీసుకెళ్లేందుకు వీలుగా తొట్టెను అమర్చడం వల్ల మూడు చక్రాలు, ప్రత్యేక అంబులెన్స్‌లకు నాలుగు చక్రాలు అమర్చబడ్డాయి. ఈ కారణంగా ఇవి మారుమూల అటవీ ప్రాంతాల్లోకి వెళ్లడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో కాకినాడ జేఎన్‌టీయూకు చెందిన నిపుణులు ప్రత్యేకంగా బైక్‌ అంబులెన్స్‌కు రూపకల్పన చేశారు. రెండు చక్రాల బైక్‌కు వెనుక భాగంలో రోగిని కూర్చోబెట్టి తీసుకెళ్లేలా ప్రత్యేకంగా సిట్టింగ్‌ (తొట్టె) ఏర్పాటు చేశారు. దీనిని ప్రయోగాత్మకంగా తూర్పు గోదావరి జిల్లా మారుమూల అటవీ ప్రాంతాల్లో ఈ ఏడాది మార్చి నుంచి నిర్వహిస్తుండగా మంచి ఫలితాలు వచ్చాయి.

బైక్‌ అంబులెన్స్‌ తీర్చిదిద్దారిలా..
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను తీసుకుని దానికి వెనుక సీటు తొలగించారు. దాని స్థానంలో పడక కుర్చీ మాదిరిగా 140 డిగ్రీల కోణంలో తొట్టె అమర్చారు. రోగి లేదా గర్భిణి భద్రంగా కూర్చునేందుకు వీలుగా దీనిని తీర్చిదిద్దారు. ఆ బైక్‌లో ప్రాథమిక వైద్యానికి అవసరమైన మెడికల్‌ కిట్‌ అందుబాటులో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు చిన్నపాటి ఆక్సిజన్‌ సిలిండర్‌ను కూడా అమర్చారు. సెలైన్‌ ఎక్కించే సౌకర్యం సైతం ఇందులో ఉంది.

డోలీ మరణాలు లేకుండా చూస్తాం
రాష్ట్రంలో డోలీ మరణాలు సంభవించకుండా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం 7 ఐటీడీఏల పరిధిలో అంబులెన్స్‌లు వెళ్లేందుకు వీలులేని 1,809 మారుమూల ప్రాంతాలు గుర్తించాం. వాటిలో 1,503 ప్రాంతాలకు బైక్‌ అంబులెన్స్‌ల సౌకర్యం కల్పిస్తున్నాం.  గర్భిణులు, అనారోగ్యం బారిన పడి న వారిని ముందుగానే గుర్తిం చేలా ‘గిరిబాట’ కార్యక్రమం చేపట్టాం. గిరిజనుల ప్రాణా ల్ని రక్షించేలా కార్యాచరణ చేపట్టాం.
– పాముల పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి

మరిన్ని వార్తలు