మూగబోయిన మాతృత్వం.. సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో

24 Jul, 2021 08:14 IST|Sakshi
నడిరోడ్డుపై మహిళకు ప్రసవం చేసిన గ్రామస్తులు

నడిరోడ్డుపైనే ప్రసవం.. శిశువు మృతి

ఐసీయూలో చికిత్స పొందుతున్న తల్లి

బాధితురాలి కుటుంబసభ్యుల రోదన

కేవీబీపురం (చిత్తూరు జిల్లా): నవమాసాలు మోసి, పురిటి నొప్పులకోర్చి ప్రసవించిన తల్లి పొత్తిళ్లలో బిడ్డను చూసుకుని మురిసిపోతుంది. అప్పటివరకు పడిన కష్టాన్నంతా మర్చిపోతుంది. అయితే గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడం ఓ తల్లికి శాపమైంది. పురిట్లోనే బిడ్డను కోల్పోయిన ఆ తల్లి రోదనలతో మాతృత్వం మూగబోయింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం కొత్తూరు పంచాయతీ గోపాలకృష్ణపురం గిరిజన కాలనీకి చెందిన సుబ్బమ్మ (28)కు నెలలు నిండాయి. అప్పటివరకు స్థానిక పీహెచ్‌సీ కోవనూరులో చూపించుకుంటూ వచ్చింది. శుక్రవారం వేకువజామున పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆశా కార్యకర్తకు సమాచారం అందించారు.

ఆమె అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులే కాన్పు చేసే ప్రయత్నం చేశారు. సాధ్యంకాక ఉదయం 7 గంటలకు 108కు సమాచారం అందించారు. అప్పటికే పురిటి నొప్పులు అధికం కావడంతో గ్రామానికి 2 కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రధాన రహదారికి చేరుకునేందుకు మట్టి రోడ్డు మీదుగా స్థానికులు చేతులపై ఆమెను మోసుకెళ్లే ప్రయత్నం చేశారు. అంతలోనే ఆమె నడిరోడ్డుపైనే ప్రసవించింది. కొంతసేపటికే శిశువు మృతి చెందింది. 108 సమయానికి చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది. అదే 108లో తల్లీబిడ్డను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శిశువు మరణించినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. బాలింతకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు