మస్తుమస్తుగా.. మార్కెట్‌ యార్డులు

6 Mar, 2022 05:25 IST|Sakshi
కొత్త రూపు దాల్చుకున్న వైఎస్సార్‌ జిల్లా పులివెందుల మార్కెట్‌ కమిటీ కార్యాలయం

నాడు–నేడు కింద సరికొత్త రూపు  

14 మార్కెట్‌ కమిటీలకు నూతన భవనాలు 

137 మార్కెట్‌ యార్డుల్లో మౌలిక వసతులు   

రూ.249.87 కోట్లతో 589 పనులు  

ఇప్పటికే 204 పనులు పూర్తి 

సాక్షి, అమరావతి: మార్కెట్‌ యార్డులు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. నాడు –నేడు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. మార్కెటింగ్‌ శాఖ ఆధీనంలో 216 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలున్నాయి. వీటి పరిధిలోని 194 యార్డులున్నాయి. దశాబ్దాల కిందట నిర్మించిన పలు యార్డుల్లోని గోదాములు శిథిలావస్థకు చేరుకు న్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే వాటిని ఆధునికీకరించడంతో పాటు, కమిటీలు ఆర్థిక పరిపుష్టి సాధించేలా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  

వచ్చే నెలాఖరు నాటికి పూర్తి.. 
గతేడాది కొత్తగా ఏర్పాటైన 14 మార్కెట్‌ కమిటీలకు పరిపాలన భవనాలతో పాటు ప్లాట్‌ఫామ్స్, స్టోరేజ్‌ గోడౌన్స్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉన్న వాటిలో 137 యార్డుల్లో బాగా దెబ్బతిన్న గోదాములపై కొత్తగా షీట్స్, కవర్డ్‌ షెడ్లు, శ్లాబ్‌లు, అప్రోచ్, సీసీ రోడ్లు, కల్వర్టులు, ప్లాట్‌ ఫామ్స్, కాంపౌండ్‌ వాల్స్, డ్రైన్స్, మరుగు దొడ్లు, బోర్‌వెల్స్, విద్యుత్, మంచినీటి పైప్‌ లెన్స్‌తో పాటు పరిపాలన భవనాలు, మీటింగ్‌ హాళ్లు, అదనపు అంతస్తులు, యార్డుల్లోని రైతు బజార్లకు కొత్త షెడ్లు, హమాలీలు, రైతులు విశ్రాంతి తీసుకునే షెడ్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నారు.

నాడు–నేడు పథకం కింద రూ.249.87 కోట్ల అంచనాతో మొత్తం 589 పనులను ప్రారంభించారు. గతేడాది జూలై 8న రైతు దినోత్సవం నాడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.60.22 కోట్ల విలువైన 204 పనులు పూర్తి కాగా, రూ.189.65 కోట్ల విలువైన మరో 385 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అత్యధికం గా కర్నూలు జిల్లాలో రూ.12.24 కోట్ల విలువైన 42 పనులు, వైఎస్సార్‌ జిల్లాలో 10.22 కోట్ల విలువైన 15 పనులు పూర్తయ్యాయి. వీటిని ఏప్రిల్‌ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో మార్కెటింగ్‌ శాఖ ముందుకుసాగుతోంది.
 

మరిన్ని వార్తలు