కోతకు గురైన ప్రాంతంలో కొత్త డయాఫ్రమ్‌ వాల్‌

6 Mar, 2023 03:45 IST|Sakshi

దెబ్బతిన్న చోట సమాంతరంగా కొత్తగా నిర్మాణం

మరో రెండు చోట్ల సరిదిద్దే విధానంపై సీడబ్ల్యూసీతో చర్చ

ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్‌ ద్వారా యథాస్థితికి

ఆ పనులు గోదావరికి వరద వచ్చేలోగా పూర్తి 

ఆ తర్వాత ప్రధాన డ్యామ్‌ పనులు – జలవనరుల శాఖకు డీడీఆర్పీ దిశానిర్దేశం

అదనపు వ్యయాన్ని చెల్లించేలా కేంద్రానికి సిఫార్సు చేయండి

అధికారుల వినతిపై సానుకూలంగా స్పందించిన డీడీఆర్పీ చైర్మన్‌ పాండ్య

కీలక సమస్యలకు పరిష్కారం దొరకడంతో పనులు వేగవంతానికి ప్రభుత్వం సన్నద్ధం

సాక్షి, అమరావతి: గోదావరి వరదల ఉద్ధృతికి పోలవరం ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–2లో ఇరువైపులా కోతకు గురైన ప్రాంతంలో దెబ్బతిన్న చోట సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించాలని జలవనరుల శాఖకు డీడీఆర్పీ సూచించింది. కోతకు గురికాని ప్రాంతంలో రెండు చోట్ల 20 మీటర్ల లోతు వరకు దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ను సరిదిద్దడంపై మరింత క్షుణ్నంగా అధ్యయనం చేసి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)తో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.

జలవనరుల శాఖ అధికారులతో భేటీ
గోదావరి వరదల ఉద్ధృతికి ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతం గ్యాప్‌–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్‌–2లో 20 మీటర్ల లోతుతో ఏర్పడిన భారీ అగాధాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్‌ (బోరు బావి తవ్వి వైబ్రో కాంపాక్షన్‌ యంత్రంతో అధిక ఒత్తిడితో భూగర్భాన్ని మెలి తిప్పడం ద్వారా పటిష్టం చేయడం) ద్వారా యథాస్థితికి తేవచ్చంటూ ఏడు నెలల క్రితం రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనకు డీడీఆర్పీ తాజాగా ఆమోదం తెలిపింది.

కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులను గోదావరికి వరద వచ్చేలోగా పూర్తి చేయాలని నిర్దేశించింది. ఆ తర్వాత డయాఫ్రమ్‌ వాల్‌ను సరిదిద్దే పనులు పూర్తి చేసి ప్రధాన డ్యామ్‌ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన సమస్యలకు డీడీఆర్పీ పరిష్కార మార్గాలు చూపడంతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది.

పోలవరం పనులను ఏబీ పాండ్య నేతృత్వంలోని డీడీఆర్పీ బృందం శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ క్రమంలో ఆదివారం రాజమహేంద్రవరంలో సీడబ్ల్యూసీ సభ్యులు ఎస్కే సిబాల్, పీపీఏ సీఈవో శివ్‌నందన్‌కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించింది. డయాఫ్రమ్‌ వాల్‌ సామర్థ్యాన్ని తేల్చే పరీక్షలు నిర్వహించిన ఎన్‌హెచ్‌పీసీ బృందం సమర్పించిన నివేదికను తాజా సమావేశంలో డీడీఆర్పీ ప్రవేశపెట్టింది.  

సరిదిద్దే మార్గం ఇలా..
  కోతకు గురైన ప్రాంతంలో డయాఫ్రమ్‌ వాల్‌ గ్యాప్‌–2లో ఎడమ వైపున 175 నుంచి 363 మీటర్ల పొడవున అంటే 188 మీటర్ల పొడవు.. కుడి వైపున 1,170 నుంచి 1,370 మీటర్ల పొడవున అంటే 200 మీటర్ల పొడవున పూర్తిగా దెబ్బతిందని ఎన్‌హెచ్‌పీసీ తెలిపింది. ఈ ప్రాంతంలో ధ్వంసమైన డయాఫ్రమ్‌ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించాలని డీడీఆర్పీ ఆదేశించింది.
డయాఫ్రమ్‌ వాల్‌లో 480 – 510 మీటర్ల మధ్య 30 మీటర్ల పొడవున ఒక చోట, 950 – 1,020 మీటర్ల మధ్య 70 మీటర్ల పొడవున మరోచోట 20 మీటర్ల లోతు వరకూ డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్నట్లు ఎన్‌హెచ్‌పీసీ తేల్చింది. ఈ రెండు ప్రాంతాల్లో డయాఫ్రమ్‌ వాల్‌ను సరిదిద్దడంపై మరింత అధ్యయనం చేసి సీడబ్ల్యూసీ సూచనల మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డీడీఆర్పీ సూచించింది.
మిగతా ప్రాంతంలో డయాఫ్రమ్‌ వాల్‌కు రెండు మీటర్ల లోతు నుంచి ఇరువైపులా బంకమట్టి (కోర్‌) నింపి దానిపై ప్రధాన డ్యామ్‌ను నిర్మించేలా సీడబ్ల్యూసీ గతంలో డిజైన్‌ను ఆమోదించింది. అయితే డయాఫ్రమ్‌ వాల్‌కు ఐదు మీటర్ల లోతు నుంచి ఇరువైపులా బంకమట్టి నింపి దానిపై ప్రధాన డ్యామ్‌ను నిర్మించాలని డీడీఆర్పీ సూచించింది. దీనివల్ల ఊట నీటిని డయాఫ్రమ్‌ వాల్‌ సమర్థంగా అడ్డుకుంటుందని తేల్చింది. 

రూ.రెండు వేల కోట్లకు పైగా వ్యయం..
గోదావరి వరదల ఉద్ధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ను సరిదిద్దడం, కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకు సుమారు రూ.రెండు వేల కోట్లు వ్యయం అవుతుందని అధికారవర్గాలు అంచనా వేశాయి. కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకే 48 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని లెక్కలు వేశారు. ఈ నేపథ్యంలో అదనంగా వ్యయమయ్యే రూ.రెండు వేల కోట్లను మంజూరు చేసేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ చేసిన విజ్ఞప్తిపై డీడీఆర్పీ చైర్మన్‌ ఏబీ పాండ్య సానుకూలంగా స్పందించారు. 

రాష్ట్ర అధికారుల ప్రతిపాదనకే మొగ్గు..
గోదావరి వరద ఉద్ధృతి ప్రభావం వల్ల ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో నదీ గర్భం కోతకు గురైంది. గ్యాప్‌–1 నిర్మాణ ప్రాంతంలో 35 మీటర్ల లోతుతో, గ్యాప్‌–2లో 20 మీటర్ల లోతుతో రెండు భారీ అగాధాలు ఏర్పడ్డాయి. కోతకు గురైన ప్రాంతంతోపాటు భారీ అగాధాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్‌ చేయడం ద్వారా యథాస్థితికి తెచ్చే విధానాన్ని ఏడు నెలల క్రితమే జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదించగా అప్పట్లో డీడీఆర్పీ తోసిపుచ్చింది. దీంతో కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులు చేపడుతూనే అగాధాలను పూడ్చేందుకు డీడీఆర్పీ సూచించిన మేరకు 11 రకాల పరీక్షలను నిర్వహించారు.

ఆ ఫలితాలను సమావేశంలో ప్రవేశపెట్టారు. వీటితో సంతృప్తి చెందిన డీడీఆర్పీ ఏడు నెలల క్రితం రాష్ట్ర అధికారులు ప్రతిపాదించిన విధానం ప్రకారమే అగాధాలను పూడ్చి యథాస్థితికి తేవాలని ఆదేశించింది. ఈ పనులను గోదావరికి వరదలు వచ్చేలోగా పూర్తి చేయాలని సూచించింది. ఆ తర్వాత డయాఫ్రమ్‌ వాల్‌ను సరిదిద్దే పనులు పూర్తి చేసి ప్రధాన డ్యామ్‌ పనులు చేపట్టడం ద్వారా ప్రాజెక్టును పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేసింది. 

మరిన్ని వార్తలు